Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలుగు అకాడెమీ పేరు మార్పు పై… ఘాటుగా లేఖ రాసిన బీజేపీ నేత జీవీఎల్…

తెలుగు అకాడెమీ పేరు మార్పు పై… ఘాటుగా లేఖ రాసిన బీజేపీ నేత జీవీఎల్
-తెలుగు భాష ఔన్నత్యాన్ని తగ్గించే అధికారం మీకెక్కడదన్న జీవీఎల్
-ఇటీవల తెలుగు అకాడెమీ పేరు మార్పు
-తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చిన సర్కారు
-ఏపీ సర్కారుపై విమర్శలు వెల్లువ

ఇటీవల ఏపీ ప్రభుత్వం తెలుగు అకాడెమీ పేరును తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శల జడివాన కురుస్తోంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడున్నర వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాష ఔన్నత్యాన్ని తగ్గించే అధికారం మూన్నాళ్లకు ఎన్నికయ్యే మీకెక్కడది ముఖ్యమంత్రి గారూ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు జీవీఎల్ లేఖ రాశారు.

మీరు అధికారంలోకి వచ్చినప్పటినుంచి తెలుగు భాష ప్రాముఖ్యతను తగ్గించే నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. తెలుగు భాష మన సంస్కృతి, ఉనికికి ఆధారమని, అలాంటి తెలుగు భాషను చిన్నచూపు చూడడం అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని తెలిపారు. మన భాషపై మనకే మక్కువ లేకపోతే అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం మరొకటి ఉండదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఆఖరికి బ్రిటీష్ వారు పరిపాలించినప్పుడు కూడా ఇంతటి సాహసం చేయలేదని స్పష్టం చేశారు.

ఆంగ్లభాషకు ఎవరూ వ్యతిరేకం కాదని, అంతమాత్రాన విదేశీ భాష మోజులో మన మాతృభాషను మరుగున పడేయాలనుకోవడం దుస్సాహసమే అవుతుందని స్పష్టం చేశారు. మొదట ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, ఆ తర్వాత డిగ్రీలో తెలుగు మాధ్యమం ఎత్తివేయాలని మరో నిర్ణయం తీసుకున్నారని జీవీఎల్ వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు. తెలుగు మీడియంలో చదవాలనుకునే వేలాది విద్యార్థులకు ఇది అశనిపాతంలా మారిందని తెలిపారు.

ఓవైపు ఉన్నతవిద్యతో పాటు సాంకేతిక విద్యను కూడా భారతీయ భాషల్లోనే బోధించేందుకు కేంద్రం చక్కని ప్రయత్నం చేస్తుంటే, మీరు సర్వం ఆంగ్లమయం చేయాలని ప్రయత్నిస్తుండడం ఆశ్చర్యంతో పాటు, అనుమానాలను కూడా కలిగిస్తోంది అని పేర్కొన్నారు. తెలుగు సహా 8 భారతీయ భాషల్లో వచ్చే విద్యాసంవత్సరానికి బీటెక్ పుస్తకాలను ఏఐసీటీఈ ముద్రిస్తుంటే… మీరు జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పనిచేయడం ఎంతవరకు సబబు ముఖ్యమంత్రి గారూ? అంటూ నిలదీశారు.

తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మార్చుతూ మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు భాష ప్రాముఖ్యత తగ్గించాలన్న మీ ఆలోచనలో భాగంగానే కనిపిస్తోంది అని జీవీఎల్ ఆరోపించారు. సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం మంచిదేనని, అందుకోసం తెలుగు అకాడెమీ కార్యకలాపాల్లో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. సంస్కృతానికి కొత్త అకాడెమీ స్థాపించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయం కావొచ్చని సూచించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనాలోచితంగా తీసుకుంటున్నవేనని, వాటిని స్వయంగా ఉపసంహరించుకోవాలని జీవీఎల్ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రభుత్వ విధానాలను అన్ని విధాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ‘మాలాగా మీరు తెలుగు మాధ్యమంలో చదవలేదు కనుక, ఈ తెలుగు లేఖను చదవడానికి ఇష్టపడరో లేక కష్టపడతారేమోనన్న అనుమానంతో ఈ లేఖ ఆంగ్ల ప్రతిని కూడా పంపుతున్నాను’ అంటూ జీవీఎల్ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Related posts

ఎంపీ పార్థసారథి రెడ్డికి తుమ్మల సత్కారం …

Drukpadam

అయినా చాలకపోతే నా తల నరకండి.. మమతా బెనర్జీ!

Drukpadam

క్యాబాత్ హై…భూముల ధరలపై సీఎం కేసీఆర్ కు ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ …!

Drukpadam

Leave a Comment