పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందన ….
-కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటా
-తెలంగాణాలో కాగ్రెస్ నాయకత్వం లోపం ఉంది
-తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది
-మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-రాష్ట్రంలో నాయకత్వ లోపం కారణంగా కాంగ్రెస్ బలహీనం
-రేవంత్‌రెడ్డి ఎంపికపై మాట్లాడదలచుకోలేదు
కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరు ఎంపీ మరొకరు ఎమ్మెల్యే ….ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వారే … ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ చీఫ్ పీఠం కోసం చివరిదాకా ప్రయత్నం చేశారు. కాని అది దక్కలేదు .తీవ్ర మనస్తాపం తో ఉన్నారు. తనకన్నా పార్టీలో జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కి పదవి కట్టబెట్టడంపై భగ్గుభగ్గు మన్నారు. వెంకటరెడ్డి పార్టీ మారతారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దాన్ని ఆయనే స్వయంగా ఖండిస్తున్నారు. కాని ఆయన చర్యలు ఆదిశగా ఆలోచనలు చేస్తున్నారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పై అసంతృప్తి తో ఉన్నారు. బీజేపీ లో చేరబోతున్నట్లు కూడా ప్రకటించారు. కాని అందుకు ఆయనకు ముహూర్తం కుదరలేదు. పార్టీ మార్పుపై ఆయన స్పందిస్తూ …. ప్రస్తుతం కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని అంటున్నారు….
కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల ఆధారంగా, కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో నిన్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ మార్పు వార్తలపై స్పందించారు. తనకు ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదన్నారు. అయితే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలపై తన భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలో నాయకత్వ లోపం కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయ లోపం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలహీనపడగా, బీజేపీ పుంజుకుందన్నారు. రేవంత్ రెడ్డి ఎంపికపై తాను మాట్లాడబోనని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు