రఘురామ పై వేటు ఖాయం …వైసీపీ విప్ మార్గాని భరత్…
-రఘురామకు త్వరలోనే నోటీసులు అందుతాయి
-స్పీకర్ కు 290 పేజీల సమాచారం అందజేత
-రఘురామ అంశాన్ని స్పీకర్ కు నివేదించామన్న భరత్
-స్పీకర్ విచక్షాధికారాలతో నిర్ణయం తీసుకుంటారని వెల్లడి
-అనర్హత పిటిషన్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందన
-పిటిషన్ పై విచారణకు ప్రక్రియ ఉంటుందన్న స్పీకర్
తమకు కొరకరాని కొయ్యగా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ప్రయత్నాలు తీవ్రం అయ్యాయి . పార్టీ ఎంపీగా నే ఉంటూ నిత్యం పార్టీ విధానాలను పార్టీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న విమర్శలు , చేస్తున్న కామెంట్లు , రాస్తున్న లేఖలు పార్టీకి , ఇటు ప్రభుత్వానికి చిరాకు పుట్టిస్తున్నాయి. దీనిపై వైసీపీ సహనంతో వ్యవహరించినప్పటికీ ఆయన మాత్రం తన దారి తనదారి తనదేనని అంటున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే ఆయన పై అనర్హత వేటు వేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
. ఇప్పటికే రఘురామపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు, తాజాగా 290 పేజీల సమాచారాన్ని ఆయనకు అందజేశారు. దీనిపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వివరించారు. రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని స్పీకర్ కు నివేదించామని, త్వరలోనే రఘురామకు నోటీసులు వస్తాయని వెల్లడించారు. స్పీకర్ తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని, స్పీకర్ విచక్షణాధికారాల మేరకు వ్యవహరించి రఘురామపై అనర్హత వేటు వేస్తారని భరత్ వెల్లడించారు. రఘురామ వైఖరి పార్టీ అధినేతకు, పార్టీ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు.
లోకసభ స్పీకర్ స్పందన …..
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ కోరుతుండడం పట్ల లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వైసీపీ దాఖలు చేసిన రఘురామ అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకునేందుకు ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించాకే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
పిటిషన్ పరిశీలన తర్వాత సభాహక్కుల కమిటీకి పంపిస్తామని ఓం బిర్లా వివరించారు. సభలో నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంటుందని పేర్కొన్నారు. సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు కొన్ని నిబంధనలు పాటించాలని అన్నారు. రఘురామ అనర్హత పిటిషన్ పై రన్నింగ్ కామెంటరీ (ప్రత్యక్ష వ్యాఖ్యానం) చేయలేమని, పిటిషన్ పరిశీలన ప్రక్రియకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.