బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారని దానిలో వస్తాం లేదు … బుగ్గన…. బుర్ర కథలు చెప్పవద్దు …. పయ్యావుల
రూ. 41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయి పయ్యావుల కేశవ్ అనవసర అనుమానాలను రేకెత్తిస్తున్నారు: బుగ్గన
–బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారనే ఆరోపణల్లో నిజం లేదు:బుగ్గన
–అన్ని వివరాలను ఏజీ కార్యాలయానికి అందిస్తాం:బుగ్గన
–బుగ్గన , మీరు మేధావి అని అందరికీ తెలుసు… పయ్యావుల
–రుణాల అంశంపై పయ్యావుల వ్యాఖ్యలు
–బుగ్గన వ్యాఖ్యలపై ఫైర్
–మీరు చెప్పేదాంట్లో ఏది నిజమంటూ ఆగ్రహం
–కనీసం ప్రజలకైనా వివరణ ఇవ్వాలని హితవు
పయ్యావుల ఆరోపణలను కొట్టిపారేసిన బుగ్గన ….
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ 41 వేల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పడంలేదని టీడీపీ కి చెందిన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యలవుల కేశవ్ తీవ్ర ఆరోపణలు చేయడంపై రాజకీయదుమారం రేగింది… దీనిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. పయ్యావుల చెప్పేదాంట్లో నిజంలేదని ,ఆయన అనవసర అనుమానాలను రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు….
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసరమైన అనుమానాలను ప్రజల్లో రేకెత్తిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఆడిట్ చేసే సమయంలో పలు రకాల ప్రశ్నలు వేయడం సహజమని.. ఆ ప్రశ్నలనే ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఏవైనా సందేహాలు ఉంటే సమావేశమై పరిష్కరించుకోవచ్చని, గవర్నర్ కు లేఖలు రాయడం, మీడియా సమావేశాలను నిర్వహించడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బిల్లులు లేకుండానే డబ్బులు చెల్లించారనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. రూ. 41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని తెలిపారు. నిజాలు తెలుసుకుని ప్రతిపక్షం మాట్లాడాలని హితవు పలికారు. వేల కోట్ల అవకతవకలు జరిగితే సంబంధిత వ్యవస్థలు చూసుకోకుండా ఉంటాయా? అని ప్రశ్నించారు.
రూ. 41 వేల కోట్ల బిల్లుల చెల్లింపులపై ఆడిట్ సంస్థ వివరణ కోరిందని… అన్ని వివరాలను ఏజీ కార్యాలయానికి అందిస్తామని చెప్పారు. ఈ గందరగోళానికి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థే కారణమని… 2018లో ఈ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందని అన్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఈ వ్యవస్థను పెట్టారని విమర్శించారు. చెల్లింపులన్నీ కేంద్రీకృతం కావడమే సమస్యకు కారణమవుతోందని అన్నారు.
ఏపీ ఆర్థికశాఖలో రూ.41 వేల కోట్లకు లెక్కాపత్రం లేదని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో, పయ్యావుల మరోసారి మీడియా ముందుకు వచ్చి బుగ్గనపై మండిపడ్డారు. బుగ్గన మేధావి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని, కానీ రాష్ట్ర ఆర్థికమంత్రి హోదాలో ఉన్నప్పుడు హుందాగా వివరణ ఇవ్వాల్సి ఉందని హితవు పలికారు.
బుగ్గనపై పయ్యావుల ఘాటు వ్యాఖ్యలు ….
తాను ఈ అంశాన్ని గవర్నర్ కు నివేదించిన తర్వాత కేవలం 7 నిమిషాలే మీడియాతో మాట్లాడానని, కానీ బుగ్గన 55 నిమిషాల పాటు మాట్లాడినా ఎక్కడా దీనిపై వివరణ ఇవ్వకపోగా, రాజకీయ ఆరోపణలే చేశారని పయ్యావుల అన్నారు.
“మా ఆరోపణలపై ఎలాంటి సమాధానం ఇవ్వాలో అధికారులు ఈ నాలుగు రోజులు కసరత్తు చేసి ఇస్తే, ఇవాళ మీరు మీడియా ముందుకొచ్చారు. ఏం మీకు అందుబాటులో మీడియా లేదా? రోజూ మీరు మీడియాలో కనిపించడంలేదా? వివరణ ఇచ్చేందుకు ఇన్నిరోజులు ఎందుకు పట్టింది? గతేడాది బ్యాంకు గ్యారంటీలపై వివరణ కోరితే ఏడాది తర్వాత బదులిచ్చారు. ఇదేనా ప్రజాపద్దుల కమిటీకి మీరిచ్చే గౌరవం?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, ప్రభుత్వ రుణాల గురించి మాట్లాడుతూ, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు రూ.25 వేల కోట్ల రుణం కోసం బ్యాంకు గ్యారంటీలను తెలియకుండా దాచారని ఆరోపించారు. వీళ్ల మాటల్లో ఒక్కటి కూడా నిజంలేదని, జీవోల్లో ఒకటి చెబుతారని, కోర్టుకెళ్లి మరొకటి చెబుతారని, అసెంబ్లీలో ప్రస్తావించకుండా దాస్తారని విమర్శించారు. అసలు, బ్యాంకులో మీరేమని సంతకం పెట్టారని నిలదీశారు.
“రూ.25 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీలపై రాష్ట్ర శాసనసభకు తెలియకుండా ఎందుకు దాచారు? దీనికి మీరేం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. దీనికి మిమ్మల్ని వివరణ అడిగితే చెప్పరు… గవర్నర్ ను మేం కలిస్తే తప్పయిపోయిందా? మేం ఢిల్లీ వెళితే మీకెందుకు బాధ?… అసలు ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది ఎవరు?” అంటూ పయ్యావుల వ్యాఖ్యానించారు.
బుగ్గన ఇకనైనా బుర్రకథలు చెప్పడం మానాలని, అవి బుగ్గన కథలుగా మిగిలిపోతాయని అన్నారు. బుగ్గన వాస్తవాలను ఇప్పటికైనా ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. “రుణాలకు సంబంధించి మేం ఏది నమ్మాలి? మీరిచ్చిన జీవోను నమ్మాలా? మీ ఏజీ గారు కోర్టుకు చెప్పింది నమ్మాలా? లేక, శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా? లేక, అసలు బ్యాంకుకు ఏమిచ్చారో అది కనుక్కోవాలా?… దీనిపై వాస్తవాలు విడుదల చేయండి” అంటూ డిమాండ్ చేశారు. తమకు జవాబివ్వకపోయినా, ప్రజలముందైనా ఉంచండి అని స్పష్టం చేశారు. ‘మీరు దోచుకున్నారని నేను అనడంలేదు, ఎందుకు దాచారని అడుగుతున్నాను’ అంటూ పయ్యావుల ప్రశ్నించారు.