హుజూరాబాద్ నియోజకవర్గ పీసీసీ ఇన్‌చార్జిగా దామోదర రాజనర్సింహ
-వడివడిగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్
-కౌశిక్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ తదుపరి కార్యాచరణ
-ఉప ఎన్నిక కో ఆర్డినేటర్లుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం
-హుజూరాబాద్‌లోని మండలాలు, మునిపాలిటీలకూ ఇన్‌చార్జిల నియామకం
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండడంతో ప్రధాన పార్టీలన్నీ దీనిపైనే దృష్టి పెట్టాయి. ఆ నియోజకవర్గ నేత కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి గా ఉన్న కౌశిక్ రెడ్డి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఆరోపణలపై ఒక పక్క దీటుగా సమాధానం ఇస్తూనే , హుజురాబాద్ లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ లోని ముఖ్యనేతలంతా హుజురాబాద్ పై కేంద్రీకరించేలా కార్యాచరణ రూపొందించారు.
హుజూరాబాద్ నియోజకవర్గ పీసీసీ ఇన్‌చార్జిగా దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది. అలాగే, ఆ స్థానం ఉప ఎన్నికల కో ఆర్డినేటర్లుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు కొనసాగుతారని ప్రకటించింది. అక్కడి మండలాలు, మునిసిపాలిటీల్లోనూ పార్టీ బలోపేతానికి ఇన్‌చార్జిలను నియమించింది.
వీణవంకకు ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్ ఇన్‌చార్జిలుగా కొనసాగుతారు. అలాగే, జమ్మికుంటకు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, జమ్మికుంట మునిసిపాలిటికి సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్యను ఇన్‌చార్జిలుగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమించారు.
హుజూరాబాద్ కు తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆ ప్రాంత మునిసిపాలిటీ పరిధికి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు, ఇల్లందకుంటకు నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలాపూర్ కు కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్ ఇన్‌చార్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.