జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి

కేటీఆర్ కు
టీయూడబ్ల్యూజే వినతి

దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలకు మోక్షం లభించేది ఎప్పుడని, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై కోర్టుల్లో వేలాది పిటిషన్లు దాఖలైనప్పటికీ వాటిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం… జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో మాత్రం కోర్టు సాకుతో కాలయాపన చేయడం సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అభిప్రాయపడింది. గురువారం నాడు మంత్రి కె.తారకరామారావుతో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన “మీట్-ది-ప్రెస్” కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు గడుస్తున్నా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండిపోవడం విచారకరమన్నారు. మూడేళ్ళుగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో తిరస్కరణకు గురవుతుండడంతో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని, మరెందరో అప్పులు చేసి చికిత్స పొందినట్లు విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు ఏ.రాజేష్, రాములు, కె.మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: