ఎర్ర సంద్రంలో చమురు చార

సేఫర్‌’ నౌకలో మొదలైన లీకేజీ
16 కోట్ల లీటర్ల చమురు ఒలికిపోయే ప్రమాదం
ఆపకపోతే మృత్యు ఒడిలోకి లక్షలాది జలచరాలు
భూగ్రహంపై మనిషి పరిణామం చెందక ముందే జీవావరణాన్ని స్థాపించిన సముద్ర జీవులు ఇప్పుడు మానవ చరిత్రలోనే అతిపెద్ద ముప్పు ముంగిట కొట్టుమిట్టాడుతున్నాయి. త్వరలో ముంచుకురాబోతున్న ఆ మహా ‘చమురు’ ఉత్పాతంపై శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.

న్యూయార్క్‌: ఎర్ర సముద్రంలో నిలిపి ఉంచిన ‘సేఫర్‌’ అనే ఓ పాతకాలపు చమురు నౌక నుంచి చమురు లీకేజీ ప్రారంభమైందని అమెరికాలోని స్టోనీ బ్రూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రస్తుతం లీకేజీ నౌక ఇంజిన్‌ భాగంలో కొద్దిస్థాయిలోనే ఉన్నదని, అయితే ఇది ఇలాగే కొనసాగితే రానున్న కొద్ది రోజుల్లోనే చమురంతా సముద్రంలోకి ఒలికిపోతుందన్నారు. సముద్రపు నీటిలో తెట్టెలా పేరుకుపోయిన ఈ చమురు జలచరాలకు ప్రాణసంకటంగా మారవచ్చని, అరుదైన పగడపు దిబ్బలు నిర్జీవమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిలో కలువకుండా నౌకలోని చమురును సురక్షితంగా వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ‘సేఫర్‌’ నౌకలో ప్రస్తుతం పది లక్షల బ్యారెళ్ల (15,89,87,295 లీటర్లు) ముడి చమురు ఉన్నదని వెల్లడించారు. 1989 అలస్కా తీరంలో లీకైన ‘ఎక్సాన్‌ వాల్డేజ్‌ ట్యాంకర్‌’లో ఉన్న చమురు కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. ఈ వివరాలు ‘ఫ్రంటియర్స్‌ ఇన్‌ మెరైన్‌ సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

అసలు ముప్పు ఇప్పుడే!
ప్రస్తుత శీతాకాలంలో చమురు లీకేజీ జరిగితే విపత్తు ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవితో పోలిస్తే.. ఎర్ర సముద్ర నీటి ప్రవాహాలు శీతాకాలంలో చురుగ్గా కదులుతాయి. దీంతో ఎర్ర సముద్రంలోని నీరు అరేబియా సముద్రం లోకి, అటునుంచి హిందూ మహా సముద్రంలోనికి ఎక్కువగా చేరుతుంది. ఇలాంటి సమయంలో చమురు లీకేజీ జరిగితే ఆ కలుషిత నీరు తొలుత హిందూ మహా సముద్రానికి.. అక్కడి నుంచి మిగతా సముద్రాలకు విస్తరించే అవకాశం ఉన్నది.

‘సేఫర్‌’ అక్కడకి ఎలా చేరింది?
సేఫర్‌’ ఆయిల్‌ ట్యాంకర్‌ను జపాన్‌ 1976లో నిర్మించింది. 1988లో ఈ నౌకను జపాన్‌ నుంచి యెమెన్‌ కొనుగోలు చేసింది. సముద్రంలో నుంచి వెలికితీసిన చమురును నౌకలో భద్రపరుస్తూ.. సముద్రం మధ్యలోనే ఈ నౌకను నిలిపి ఉంచింది. అయితే 2015లో యెమెన్‌లో జరిగిన అంతర్యుద్ధంలో హౌతీ దళాలు (యెమెన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటుదారులు) ఈ నౌకను ఆధీనంలోకి తీసుకున్నాయి. నిర్వహణ సరిగ్గాలేకపోవడంతో ఆ నౌక దెబ్బతిన్నది. దీంతో నౌకలోని పది లక్షల బ్యారెళ్ల చమురు లీకేజీ ప్రారంభమైంది.

1989లోనూ ఇలాగే..
ఎక్సాన్‌ వాల్డేజ్‌ చమురు నౌక ప్రమాదం మార్చి 24, 1989లో జరిగింది. అలస్కా సముద్ర జలాల్లోని బ్లిగ్‌ రీఫ్‌ అనే పెద్ద బండరాయిని ఢీకొనడం వల్ల ఈ నౌకలోని 1.1 కోట్ల గ్యాలన్ల (4,16,39,530 లీటర్లు) చమురు నీటిలో ఒలికిపోయింది. 1,300 మైళ్ల సముద్ర జలాల్లో చమురు తెట్టెలా పేరుకుపోవడంతో లక్షలాది సముద్ర పక్షులు, సీల్స్‌, చేపలు, తిమింగలాలు చనిపోయాయి. తెట్టును తొలగించడానికి 11 వేల మంది సిబ్బంది వెయ్యి గంటలపాటు నిరంతరాయంగా పనిచేయాల్సి వచ్చింది. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చమురు చారలు కనిపిస్తూనే ఉంటాయి.

Leave a Reply

%d bloggers like this: