నీళ్ళు తాగితే కవలలు పుడతారా…?

ఈ ఊరి బావి నీళ్ళు తాగితే కవలలు పుడతారా… జనం నమ్మకానికి ఏమిటి కారణం?
ఊరి బావి కథ ఇప్పుడూ.. ఊరూ వాడా హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ బావి నీరు తాగితే కవలలు పుడుతున్నారంటూ మీడియా కథనాలు రావడంతో దూర ప్రాంతాల వారు సైతం ఈ బావి నీటి కోసం ఎగబడుతున్నారు. మరి, ఈ నీళ్ల వల్ల సంతానం కలుగుతుందన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అసలు దానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలోని ఓ ఊట బావి ఈ చర్చకు తెరలేపింది.
సుమారు 4,500 జనాభా కలిగిన కుగ్రామం దొడ్డిగుంట. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామం. మెట్ట పంటల సాగు ఎక్కువగా ఉంది. గతంలో చాలాకాలం పాటు ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండేది. ఇటీవలే హైస్కూల్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రామం నుంచి పలువురు ఉన్నత చదువులను కూడా అభ్యసిస్తున్నారు.
గ్రామంలో చాలాకాలం పాటు బావి నీళ్లు మాత్రమే వినియోగించేవారు. తాగడానికి, వాడుకోవడానికి కూడా అవే నీళ్లు. ఆ నీళ్లే ఇప్పుడు ఈ గ్రామాన్ని అందరికీ పరిచయం చేస్తున్నాయి. నీళ్ల చుట్టూ సాగిన ప్రచారంతో పలువురు ఆ నీటి బావికి క్యూ కట్టేలా చేస్తున్నాయి.
కవలల గ్రామం
సమాజంలో కవలలు అరుదుగా కనిపిస్తుంటారు. కొన్ని చోట్ల ఒకటి, రెండు జంటలు కనిపిస్తారు. కానీ, దొడ్డిగుంట పూర్తిగా భిన్నం. ఈ ఊరిలో పెద్ద సంఖ్యలో కవలలు కనిపించడమే విశేషంగా మారింది.
ఇప్పటి వరకూ ఎంతమంది కవలలు ఉన్నారనే విషయంలో స్పష్టత లేనప్పటికీ గ్రామ సర్పంచి అడపా వెంకటేష్ మాట్లాడుతూ… “మా గ్రామంలో 110 మంది కవలలున్నారు. ఇక్కడ కవలలు ఎక్కువగా పుట్టడానికి ఊరి చివరిలో ఉన్న బావి నీరే కారణమని చెబుతుంటారు. ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకూ కవలలున్నారు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే మా ఊరికి గుర్తింపు వచ్చింది” అని చెప్పారు.
మాస్టారు రాకతో
సుమారు 30 ఏళ్ల క్రితం దొడ్డిగుంట ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు వచ్చిన ఓ మాస్టారు ద్వారానే ఈ గ్రామంలో కవలలు ఎక్కువగా ఉన్నారని ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకూ గ్రామస్థులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదట.
“నాకు 15 ఏళ్ల వయసులో ఓ మాస్టారు జనాభా లెక్కల కోసం ఇంటింటికీ తిరుగుతుంటే చాలామంది కవలలు కనిపించారు. దాంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మాస్టారు మా ఊరికే కాపురం వచ్చారు. ఆయనకు కూడా తనకు చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదని బాధపడేవారు. కానీ, మా ఊరు రావడం, ఆ బావి నీరు తాగడంతో ఆయన భార్య కూడా కవలలకు జన్మనిచ్చారు. దాంతో దొడ్డిగుంట బావి నీళ్లు తాగితే పిల్లలు పుడతారు, కవలలు పుడతారని ఆయన స్థానిక పత్రికల వారికి చెప్పడంతో మా ఊరి గురించి పేపర్లలో వచ్చింది” అని స్థానికంగా నివాసం ఉంటున్న 45 ఏళ్ల రైతు వెంకట్రావు వివరించారు.
హైదరాబాద్ నుంచి వస్తున్నారు
ప్రస్తుతం దొడ్డిగుంట గ్రామానికి తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమంది తరలివస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో గ్రామానికి రావడం, బావి ఆచూకీ తెలుసుకోవడం, నీళ్ల టిన్నులతో తిరిగి వెళ్లడం చాలా సహజంగా మారిపోయింది.
పలు టీవీ చానెళ్లలో వచ్చిన వార్తా కథనాలతో అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఉందని, కవలలు కూడా జన్మిస్తారనే ప్రచారం జోరుగా సాగడంతోనే అత్యధికులు వస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన అనిత మాట్లాడుతూ… “ఈ బావి గురించి టీవీలలో చూశాం. మాకు పెళ్లయ్యి నాలుగేళ్లయ్యింది. పిల్లల కోసం చాలా ప్రయత్నం చేశాం. కానీ, ఫలించలేదు. ఇదో చిన్న ప్రయత్నంగా చేస్తున్నాం. ఈ బావి నీళ్లలో ఉన్న ప్రత్యేకత కూడా చూడాలని వచ్చాం. రెండు టిన్నులలో నీళ్ళు తీసుకెళుతున్నాం” అని చెప్పారు.
గ్రామంలో కవలలు పెద్ద సంఖ్యలో ఉండడానికి ఈ బావి నీళ్లే కారణమని స్థానికురాలు మహిళ లక్ష్మీ అంటున్నారు.
తొమ్మిది నెలల క్రితం ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన ఆమె మాట్లాడుతూ.. “ఆ బావి నీళ్ల ప్రభావమే ఇదంతా. మా ఊరిలో చాలామంది కవలలు ఉండడానికి కారణం అదే. అంతే గాకుండా ఆ నీళ్లు తాగిన వారి ఆరోగ్యం కూడా బాగవుతోంది. అందుకే మూడేళ్ళ క్రితం గ్రామ పంచాయితీ కుళాయిలు వేసినా మేము మాత్రం బావి నీళ్లే తాగుతున్నాం” అని ఆమె చెప్పారు.
బావి నీళ్లతో పిల్లలు పుడతారా?
బావి నీళ్ల వల్ల పిల్లలు కలుగుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై జనవిజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్‌తో మాట్లాడింది.
“దొడ్డిగుంటలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా నీటి వల్ల పిల్లలు పుడతారన్న ప్రచారంలో నిజం లేదు. ఆక్సిజన్, హైడ్రోజన్ సమ్మిళితం నీరు. అందులో మరికొన్ని సూక్ష్మ లవణాలుంటాయి. కాల్షియం కార్భోనేట్, ఐరన్, కాల్షియం వంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ కలిగించే అవకాశం లేదు. కానీ, నీటిలోని లవణాల కారణంగా కొన్ని సమస్యలు తీరతాయి. ఆ బావి నీటి వల్ల అందరికీ పిల్లలు, కవలలు పుడుతున్నారని అనుకుంటే… మరి ఆ గ్రామంలోనే పిల్లలు లేని వారు ఎందుకున్నారో తెలియాలి కదా? బావి నీటితో పిల్లలు పుడుతున్నారనేది కేవలం నమ్మకం మాత్రమే. శాస్త్రీయత లేదు” అని ఆయన అన్నారు.
సంతానోత్పత్తికి, నీటికి సంబంధం లేదు
బావి నీటి వల్ల పిల్లలు పుడుతున్నారనే ప్రచారానికి, వాస్తవానికి సంబంధం లేదని రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ పద్మజ అన్నారు.
“కవలలు జన్మించడానికి జన్యుపరమైన పలు కారణాలున్నాయి. వంశపారంపర్యత కూడా ఒక కారణమే. ముఖ్యంగా గర్భదారణ సమయంలో ఒకటి కన్నా ఎక్కువగా అండం విడుదల కావడం, ఫలదీకరణ చెందడం ప్రధాన కారణం. జెనిటిక్స్, వయసు, మునుపటి గర్భాలు, పునరుత్పత్తి వంటివి ప్రభావం చూపుతాయి. శాస్త్రీయంగా పిల్లలు కలగకపోవడానికి కూడా అనేక కారణాలున్నాయి. కానీ, బావి నీరు తాగితే పిల్లలు పుడుతున్నారనే ప్రచారానికి, గర్భదారణకు ఎటువంటి నిర్థారణ లేదు” అని చెప్పారు.
కారణాలు ఏమయినా ప్రస్తుతం దొడ్డిగుంట గ్రామంలోని బావి నీటిని ఏకంగా అమెరికాకు సైతం పంపించే స్థాయికి ప్రచారం చేరడం వింతగా కనిపిస్తోంది. నిపుణులు ఏం చెబుతున్నప్పటికీ సాధారణ జనం మాత్రం ప్రచారమాయలో పెద్ద సంఖ్యలో తరలివస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.