తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ… స్పష్టతనిచ్చిన పవన్

తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ… స్పష్టతనిచ్చిన పవన్ కళ్యాణ్
– జనసైనికులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా-పవన్
-పవన్ తో భేటీ అయిన సోము వీర్రాజు, దేవధర్
-తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై చర్చ
-జనసేన శ్రేణులు దూరదృష్టితో ఆలోచించాలని సూచన
తిరుపతి పార్లమెంట్ కు జరగనున్న ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పోటీ ఖాయమైంది . ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చాడు . తిరుపతి నుంచి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని మొదట తీర్మానించిన సంగతి తెలిసిందే. అయితే, ఏ పార్టీకి చెందిన నేత తిరుపతి బరిలో దిగుతాడన్నదానిపై క్లారిటీ లేదు. ఇప్పటి వరకు మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్న బీజేపీ ,జనసేనలు ఎవరికీ వారు తమ అభ్యర్థి పోటీలో ఉంటాడంటే తమ అభ్యర్థి ఉంటాడని చెప్పుకున్నారు. కానీ చివరకు పవన్ ఎందుకో మెత్తబడ్డారు. బీజేపీ నాయకులతో భేటీ అనంతరం పవన్ మాట్లాడుతూ తిరుపతి లో జరిగే ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కంటే తిరుపతి అభివృద్ధి ముఖ్యమని భావించామని వెల్లడించారు. 1999లో తిరుపతి పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు.
“ఈ సందర్భంగా జనసేన శ్రేణులకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. జనసేన పార్టీ తరఫున మేం ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీతోపాటు పార్టీ జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలోపేతం కావడానికే అని గమనిస్తారని ఆశిస్తున్నా. తిరుపతి అభ్యర్థిపై నిర్ణయాన్ని జనసేన శ్రేణులు దూరదృష్టితో ఆలోచిస్తాయని భావిస్తున్నా” అంటూ సందేశం వెలువరించారు. ఇవాళ తిరుపతి అభ్యర్థి అంశంతో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ జనసేనాని పవన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. వారితో సమావేశం తరువాత పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది .తిరుపతి అభ్యర్థి జనసేన పోటీచేస్తుందని బాహించిన కార్యకర్తలకు నిరాశ ఎదురైంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో తిరుపతి పార్లమెంట్ పరిధి లో జనసేనకు కొన్ని పంచాయతీలు వచ్చినప్పటికీ ,బీజేపీ కి రాకపోవడం గమనార్హం . బీజేపీ కన్నా జనసేన పోటీ చేస్తేనే ఎక్కువ ఓట్లు పొందే ఆవకాశం ఉందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

%d bloggers like this: