Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం…

  • కొవిన్‌‌ యాప్‌లో ఇక కరోనా యోధుల రిజిస్ట్రేషన్‌ను అనుమతించొద్దని నిర్ణయం
  • ఈ కేటగిరీలో అనర్హుల రిజిస్ట్రేషన్‌
  • ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న కేంద్రం
  • రిజిస్టర్‌ చేసుకున్న వారికి త్వరగా టీకా ఇవ్వాలని ఆదేశం
  • రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులు
Centre asked not to allow FW HCW to register in CoWIN App

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిన్‌ యాప్‌లో ఇకపై హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల రిజిస్ట్రేషన్లను అనుమతించొద్దని రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ కేటగిరీలో కొందరు అనర్హులు కూడా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్‌ చేసుకొని టీకా వేయించుకుంటున్నారని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేటగిరీ కింద ఇప్పటికే రిజిస్టర్‌ చేసుకున్న వారికి వీలైనంత త్వరగా టీకా అందేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

ఈ కేటగిరీలోకి వచ్చేవారు టీకా కోసం రిజిస్టర్‌ చేసుకునేందుకు ఇప్పటికే అనేక సార్లు గడువు పొడిగించినట్లు ఉత్తర్వుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు టీకా వేయడం ప్రారంభించిన తర్వాత కూడా వారికి అవకాశం కల్పించామని తెలిపారు. ఇక 45 ఏళ్ల పైబడినవారు టీకా పొందేందుకు కొవిన్‌ లో  రిజిస్ట్రేషన్‌ కొనసాగుతుందని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ జనవరిలో ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలుత హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అవకాశం కల్పించారు. కానీ, తొలినాళ్లలో టీకా వేసుకునేందుకు చాలా మంది ముందుకు రాలేదు. దీంతో మరోసారి అవకాశం రాదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఈ కేటగిరీల్లో కొంత కదలిక వచ్చింది. అలాగే వైద్యనిపుణుల భరోసా, అవగాహన కార్యక్రమాలతో అనేక మందిలో విశ్వాసం కలిగింది. అయినప్పటికీ.. ఇప్పటికీ ఈ కేటగిరీలో కొంత మంది టీకా వేసుకోకపోవడం గమనార్హం.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7.44 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేశారు. వీరిలో 89,53,552 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు తొలి డోసు, 53,06,671 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు రెండో డోసు తీసుకున్నారు. అలాగే 96,19,289 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి డోసు, 40,18,526 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోసు టీకా అందించారు. ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా.. మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సైతం వేగంగానే కొనసాగుతోంది.

Related posts

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం స‌హా ఏపీ, తెలంగాణ‌ల‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Drukpadam

సీఎం స్టాలిన్ భార్యకు ఆలయ ఛత్రం.. వివాదం!

Drukpadam

పంటనష్టం ఎకరాకు 20 వేలు ఇవ్వాలి…సీఎం కేసీఆర్ కు తమ్మినేని వినతి

Drukpadam

Leave a Comment