ఐపీఎల్ జరగాలంటే… బీసీసీఐ ముందున్న ఆప్షన్లు ఇవే!

ఐపీఎల్ జరగాలంటే… బీసీసీఐ ముందున్న ఆప్షన్లు ఇవే!
  • 10 రోజుల్లో తిరిగి పోటీలను ప్రారంభించాలని భావిస్తున్న బీసీసీఐ
  • ముంబైలోని మూడు స్టేడియాల్లో పోటీలకు అవకాశం
  • కుదరకుంటే దుబాయ్ కి తరలింపు
  • పలు మార్గాలను అన్వేషిస్తున్న బీసీసీఐ

ఐపీఎల్ జరిగి తీరుతుందని చెబుతూ వచ్చిన బీసీసీఐ, ఇప్పుడు పరిస్థితులకు తలొగ్గి, నిరవధిక వాయిదాను వేసింది. తిరిగి పోటీలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయమై స్పష్టత లేకున్నా, మరో 10 రోజుల వ్యవధిలో పోటీలను ప్రారంభించాలని భావిస్తున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, అందుకు మూడు ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఐపీఎల్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఒకే ఒక్క వేదికను నిర్ణయించుకుని, అక్కడే అన్ని మ్యాచ్ లూ జరపడం ఒక ఆప్షన్ కాగా, జూన్ లో కేసులు తగ్గుతాయని భావిస్తున్న నేపథ్యంలో, పోటీలు జూన్ వరకూ వాయిదా వేయడం మరొకటి. మూడో ఆప్షన్ గా, ఆటగాళ్లను దుబాయ్ కి తరలించి, అక్కడే మ్యాచ్ లను నిర్వహించడాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

మరో పది రోజుల్లో క్రికెటర్లు, వాటి ఫ్రాంచైజీలకు క్వారంటైన్ పూర్తి అవుతుంది. అప్పుడిక ముంబైలో అన్ని మ్యాచ్ లనూ జరిపించాలని బీసీసీఐ యోచిస్తోంది. ముంబైలో మూడు స్టేడియాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ స్టేడియాలకు దగ్గర్లోని హోటళ్లను సైతం బీసీసీఐ సంప్రదించింది. పలు నగరాల్లో బయో బబుల్ ను నిర్వహించడం కన్నా, ఒకే నగరంలో అయితే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. నగరంలోని వాంఖడే, బ్రబౌర్న్, జింఖాన్ గ్రౌండ్స్ లో పోటీలు జరిపిస్తే సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక రెండో ఆప్షన్ గా కనీసం జూన్ వరకూ పోటీలను వాయిదా వేయాలన్నది మరో యోచన. అదే జరిగితే, ఇండియా – న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా జరగాల్సిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ తుదిపోరును వాయిదా వేయాల్సి వుంటుంది. అందుకు ఐసీసీ అనుమతి అవసరం. జూన్ 18న ఈ పోటీ జరగాల్సి వుండగా, దాన్ని జులైకి మార్చాలని బీసీసీఐ కోరి, అందుకు అనుమతి లభిస్తేనే ఈ ఆలోచన కార్యరూపం దాల్చే వీలుంటుంది.

మూడో ఆప్షన్ దుబాయ్. టీ-20 వరల్డ్ కప్ పూర్తి కావడానికి ముందే ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లను పూర్తి చేయాలంటే, యూఏఈని బ్యాకప్ వేదికగా చేసుకోవాలని బీసీసీఐ ఆదిలోనే నిర్ణయించింది. ఇప్పుడు ఆ ఆప్షన్ ను మరోసారి పరిశీలించి, ఐపీఎల్ ను దుబాయ్ లో ముగించాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. తమ ముందున్న అవకాశాల్లో ఏది జరుగుతుందో వేచి చూడాలి.

 

ఐపీఎల్ వాయిదా నష్టం రూ. 2,200 కోట్లు
  • ఐపీఎల్‌ అర్ధాంతరంగా వాయిదా పడడంతో బీసీసీఐకి భారీ నష్టం
  • ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకు మాత్రమే స్పాన్సర్లు చెల్లించే అవకాశం
  • ఫ్రాంచైజీలు కూడా ఆటగాళ్లకు అదే లెక్కన చెల్లింపులు!
BCCI set to lose over Rs 2000 crores due to IPL 2021 postponement

ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో బీసీసీఐకి దాదాపు రూ. 2,200 కోట్ల మేర నష్టం జరిగే అవకాశం ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టోర్నీ సజావుగా సాగి ఉంటే స్పాన్సర్లు, ప్రసారకర్తల నుంచి మొత్తం డబ్బులు బోర్డుకు ముట్టేవి. నిజానికి వీరందరూ మ్యాచ్‌ల లెక్కన బోర్డుకు చెల్లింపులు జరుపుతారు.

దీంతో ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు మాత్రమే జరగడంతో అప్పటి వరకు మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. దీంతో మిగిలిపోయిన మ్యాచ్‌లకు సంబంధించిన సొమ్ము బోర్డుకు అందే పరిస్థితి లేదు. ఇంకా దాదాపు సగం మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో బీసీసీఐకి రావాల్సిన ఆదాయంలో 50 శాతం కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

పరిస్థితులు అనుకూలించి మ్యాచ్‌లు మళ్లీ జరిగితే కనుక ఈ నష్టాల నుంచి బీసీసీఐ బయటపడే అవకాశం ఉంది. ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో కూడా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకే చెల్లించే అవకాశం ఉండగా, ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు సగం డబ్బులు మాత్రమే చెల్లించే అవకాశం ఉందని సమాచారం. అయితే, తమకు జరిగిన నష్టం గురించి మాట్లాడేందుకు ఎవరూ స్పందించడం లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న క్లిష్టపరిస్థితుల నేపథ్యంలో లీగ్ వాయిదాను సమర్థిస్తున్నట్టు వీరంతా చెప్పుకొచ్చారు.

Leave a Reply

%d bloggers like this: