Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే పదవికి ఈటల గుడ్ బై …వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం

ఎమ్మెల్యే పదవికి ఈటల గుడ్ బై …వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం
-తొలుత గన్ పార్క్ వద్ద అమర వీరులకు నివాళి
-తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు
-నేను ప్ర‌జ‌ల మద్దతుతోనే గెలుస్తూ వ‌స్తున్నాను
-అంతతరం అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా అందజేత
-ఈటల రాజీనామా ఆమోదించినట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటన
-హుజురాబాద్ సీటు ఖాళీ అయినట్లు గెజిట్
-రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్‌కు అందిద్దామ‌నుకున్నా..
-కానీ, అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి ఇవ్వాల్సి వ‌చ్చిందన్న ఈటల
-అనివార్య కార‌ణాల వ‌ల్ల ఇలా చేశాన‌ని వివ‌ర‌ణ‌
– అనుచ‌రుల‌ను లోప‌లికి రానివ్వ‌లేదని ఆగ్ర‌హం
-ఈ నెల 14న బీజేపీలో చేరనున్న ఈటల

 

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను అసెంబ్లీలో స‌భాప‌తి కార్యాల‌యంలో అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ.. స‌భాప‌తిని క‌లిసి రాజీనామా లేఖ ఇవ్వాల‌ని భావించాన‌ని తెలిపారు. అయితే, అనివార్య ప‌రిస్థితుల్లో రాజీనామా లేఖ‌ను అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి అంద‌జేశాన‌ని చెప్పారు. త‌న‌తో వ‌చ్చిన త‌న అనుచ‌రుల‌ను, మ‌ద్ద‌తుదారుల‌ను అసెంబ్లీ సిబ్బంది లోప‌లికి అనుమ‌తించ‌లేద‌ని ఆయ‌న తెలిపారు.

‘తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌న కొన‌సాగుతోంది. మీడియా పాయింట్ వ‌ద్ద‌కు ఈ రోజు ర‌వీంద‌ర్ రెడ్డిని కూడా అనుమ‌తించ‌లేదు. దీన్ని బ‌ట్టి ఫ్యూడ‌ల్ వ్య‌వ‌స్థ ఎంత బ‌లంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. త‌న‌కు ప్ర‌జ‌లు క‌నెక్ట్ అయ్యార‌ని, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు? ఎంపీలు ఎందుకు? అని కేసీఆర్ గారు అంటుంటారు. ఆ విధంగా వ్య‌వ‌స్థ‌ల‌ను ఆయ‌న అవ‌మానిస్తున్నారు’ అని ఈట‌ల రాజేంద‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

స్పీక‌ర్ రాజీనామాను ఆమోదించాక హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గానికి ఆరు నెల‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు ఇటీవ‌లే రాజీనామా చేశారు. ఈనెల 14న ఆయ‌న బీజేపీలో చేర‌డానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు నేత‌లు కూడా బీజేపీలో చేర‌నున్నారు.

 

గన్ పార్క్ వద్ద ….

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ శామీర్ పేట నుంచి హైద‌రాబాద్‌లోని గన్ పార్కుకు వ‌చ్చి అమరవీరులకు నివాళులు అర్పించారు. కాసేప‌ట్లో ఆయ‌న అసెంబ్లీ స్పీక‌ర్‌కు రాజీనామా సమర్పించనున్నారు. అసెంబ్లీకి వెళ్లి అక్క‌డి స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా సమర్పించాలని ఆయ‌న‌ నిర్ణయించుకున్నారు. ఈట‌ల వెంట ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి, తుల ఉమ ఉన్నారు.

అమరవీరులకు నివాళులు అర్పించిన అనంత‌రం ఈట‌ల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. క‌రోనా క‌ట్టడికి తెలంగాణ స‌ర్కారు స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేదని మండిపడ్డారు. తాను ప్ర‌జ‌ల మద్దతుతోనే ఇన్నాళ్లూ ఎన్నిక‌ల్లో గెలుస్తూ వ‌స్తున్నానని అన్నారు.

‘ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి నాకు ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీ బీఫాం ఇచ్చి ఉండొచ్చు కానీ, నేను గెలుస్తున్న‌ది మాత్రం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతోనే. వారే న‌న్ను గెలిపిస్తున్నారు. తెలంగాణ‌లో నేను ఎన్నో పోరాటాలు చేశాను. అధికార దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ ఉప ఎన్నిక‌లో గెల‌వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను టీఆర్ఎస్ ప‌ట్టించుకోవ‌ట్లేదు. క‌రోనాతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేదు’ అని ఈట‌ల రాజేంద‌ర్ ధ్వజమెత్తారు.

‘నేను 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ టీఆర్ఎస్ గెలుస్తోంది. నాలాంటి వారిపై ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ ఈ రోజు ఎలాంటి ధోర‌ణిని అవ‌లంబిస్తుందో ప్ర‌జ‌లు, తెలంగాణ‌ ఉద్య‌మకారులు గ‌మ‌నించాలి. హుజూరాబాద్ లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక వంటిది. ప్ర‌జ‌లు ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకుంటార‌ని ఆశిస్తున్నాను. న‌న్ను నిండు మ‌న‌సుతో హుజూరాబాద్ ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించారు. తెలంగాణ ప్ర‌జ‌లు, రైతులు, నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌ట్లేదు. అలాంటి వారికి గ‌ట్టిగా బుద్ధి చెప్పాలి’ అని ఈట‌ల చెప్పారు

 

 

ఈటల రాజీనామా ఆమోదం తెలిపినట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటన

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ తో అన్ని సంబంధాలు తెగిపోయాయి. ఆయన ఇక బీజేపీలో చేరడమే తరువాయి. ఈటల నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈటల రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. నేడు అమరవీరులకు నివాళులు అర్పించిన ఈటల స్పీకర్ ఫార్మాట్ లో రూపొందించిన తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఆ రాజీనామా పత్రాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం ఆమోద ముద్ర వేశారు.

భూఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొన్న ఈటలను తెలంగాణ మంత్రివర్గం నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన ఈటల బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 14న ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈ సాయంత్రం ఈటల ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన వెంట రమేశ్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు కూడా హస్తిన వెళ్లి బీజేపీలో చేరతారని తెలుస్తోంది.

అంతకుముందు, రాజీనామా సందర్భంగా ఈటల మాట్లాడుతూ, హుజూరాబాద్ లో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య పోరాటం వంటిదని పేర్కొన్నారు. త్వరలో హుజూరాబాద్ లో పాదయాత్ర చేస్తానని వెల్లడించారు.

Related posts

సాగర్ లో బీజేపీ ప్రయోగం సక్సెస్ అవుతుందా… ?

Drukpadam

ఆఫ్ఘన్ లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అమెరికా!

Drukpadam

సీఎంని వాడు, వీడు అంటే నాలుక చీరేస్తాం: బండి సంజయ్ కి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్!

Drukpadam

Leave a Comment