జగన్ బెయిలు రద్దవుతుందంటూ కథనం.. విచారణ వాయిదా వేసిన సిబిఐ కోర్టు….

 జగన్ బెయిలు రద్దవుతుందంటూ కథనం.. విచారణ వాయిదా వేసిన సిబిఐ కోర్టు
-సీఐడీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
-ఓ వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కథనంలో సూచన
-ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి
-తమ వాదనలు లిఖిత పూర్వకంగా సమర్పిస్తామన్న సీబీఐ
-అందుకు 10 రోజుల గడువు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి
-రఘురామ తరఫు న్యాయవాది అభ్యంత‌రాలు
-త‌దుప‌రి విచారణ ఈ నెల 26కి వాయిదా

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు ఈ నెల 14న రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అవుతోందని, దీనిని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడు మనోహర్ మరికొందరు కలిసి సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు నిన్న ఫిర్యాదు చేశారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ఈ కథనం ఉందని, ఈ కథనం ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి బెయిలు రద్దవుతుందని, ఆ రోజున టీడీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ కథనంలో పేర్కొన్నారని వైసీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఓ వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులను కూడా నమ్మవద్దని, 1988 డిసెంబరు, 1991 మేలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలే జరిగాయని, పోరాటం అంతిమ దశకు చేరుకుంటుండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆ కథనంలో పేర్కొన్నారని నేతలు పేర్కొన్నారు.

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై విచారణ ఈనెల 26 కి వాయిదా

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఈ రోజు కూడా హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా, లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పిస్తామని సీబీఐ తెలిపింది. అలాగే అందుకు 10 రోజుల గడువు ఇవ్వాల‌ని కోర్టును కోరింది. అయితే, సీబీఐ తీరుపై రఘురామ తరఫు న్యాయవాది అభ్యంత‌రాలు తెలుపుతూ.. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందని అన్నారు. కోర్టు ఈ పిటిషన్‌పై త‌దుప‌రి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

Leave a Reply

%d bloggers like this: