కత్తి మహేశ్ మృతిపై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం…..

కత్తి మహేశ్ మృతిపై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం..
డ్రైవర్ సురేశ్ ను విచారించిన పోలీసులు
కత్తి మహేశ్ మృతిపై మంద కృష్ణ మాదిగ అనుమానాలు
మహేశ్ కి శత్రువులు ఉన్నారని వ్యాఖ్య
విచారణ జరిపించాలని జగన్ ను కోరిన మంద కృష్ణ

సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడితే, డ్రైవింగ్ చేస్తున్న సురేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని చెప్పారు. మహేశ్ కి శత్రువులు ఉన్నారని, గతంలో ఆయనపై దాడి జరిగిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మహేశ్ కు జరిగిన ప్రమాదం, ఆయన మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు.

మంద కృష్ణ మాదిగ విన్నపం పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు విచారణను ప్రారంభించారు. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ చేసిన సురేశ్ ని పిలిచి విచారించారు. ప్రమాదం జరిగిన తీరుపై వివరాలను తీసుకున్నారు. కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడితే, సురేశ్ కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అంతేకాదు, ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరిగిందనే విషయంపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

మరోవైపు కత్తి మహేశ్ తండ్రి ఓబులేసు మాట్లాడుతూ, తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని చెప్పారు. మహేశ్ చనిపోయిన విషయాన్ని తమకు చెప్పలేదని… నేరుగా బయటకు వెల్లడించారని అన్నారు. తన కుమారుడి మృతిపై న్యాయ విచారణ జరగాలని కోరారు. తన ఆరోగ్యం ప్రస్తుతం సహకరించడం లేదని… న్యాయం కోసం తాను పోరాడే స్థితిలో లేనని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: