బలహీనులకు అండగా సుప్రీంకోర్టు-అది వారికీ తెలుసు-ఛీఫ్ జస్టిస్ రమణ కామెంట్స్

మన దేశంలో పేదలకు, సహాయం కోరే వారికి న్యాయవ్యవస్ధ ఎప్పుడూ అండగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. పరిస్ధితులు విషమించినప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధకు రక్షణగా ఉన్న సుప్రీంకోర్టు తమకు అండగా ఉంటుందని ప్రజలకు తెలుసని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

ధర్మం ఎక్కడుందో విజయం అక్కడుంటుందనే సుప్రీంకోర్టు భావనకు రాజ్యాంగంతో పాటు న్యాయవ్యవస్ధపై ప్రజలకు ఉన్న నమ్మకం జీవం పోస్తున్నాయని ఆయన తెలిపారు. సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్లో జరుగుతున్న ఇండో-సింగపూర్ మీడియేషన్ సమ్మిట్ లో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇందులో సింగపూర్ ఛీఫ్ జస్టిస్ సుందరేష్ మీనన్ కూడా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు సీజేగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణకు ఆయన అభినందనలు తెలిపారు.

సమాజంలో రాజకీయ, ఆర్ధిక, సాంఘిక,, సాంస్కృతిక, మతపరమైన అంశాల్లో ఘర్షణ సహజమేనని, అటువంటప్పుడు దాని పరిష్కారం కోసం వ్యవస్ధల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ తో పాటు ఎన్నో ఆసియా దేశాల్లో సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకునే సంప్రదాయం ఉందని జస్టిస్ రమణ అన్నారు. న్యాయవ్యవస్ధలో కేసుల పెండింగ్ పై మాట్లాడుతూ గత 24 గంట్లలో దాఖలైన కేసును ఎన్ని రోజుల్లో పరిష్కరించారన్నదే మాట్లాడుతున్నారని, కానీ అప్పటికే ఉన్న కేసులకు ఇది జత కలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టుల్లో కేసుల పెండింగ్ కు కరోనా కూడా తోడైందని జస్టిస్ రమణ వెల్లడించారు.

దేశంలో న్యాయ సహాయం కోసం చేపడుతున్న కార్యక్రమాల వల్ల 70 శాతం మంది ప్రజలకు న్యాయం చేరువైందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. ఇందులో పేదలు, మహిళలు, పిల్లలు, మైనార్టీలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు కూడా ఉన్నారన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రత్యామ్నాయ న్యాయవ్యవస్ధలైన లోక్ అదాలత్, లీగల్ సర్వీసెస్ అధారిటీల ద్వారా భారీ ఎత్తున కేసుల పరిష్కారం జరుగుతోందన్నారు.

Leave a Reply

%d bloggers like this: