సెక్షన్ 124ఏ పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ!

సెక్షన్ 124ఏ పిచ్చోడి చేతిలో రాయిలా మారింది:సీజేఐ  ఎన్వీ రమణ!
రాజకీయ ప్రత్యర్థులను అణచి వేయడానికి వాడుతున్నారు
బ్రిటీష్ కాలం నాటి ఈ చట్టం ఇప్పుడు అవసరమా?
ఈ చట్టం వల్ల వ్యక్తులకు, వ్యవస్థలకు చాలా నష్టం జరుగుతుంది

సెక్షన్ 124ఏ (దేశద్రోహం) ఇప్పుడు మన దేశంలో తరచుగా వినిపిస్తోంది. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న వారిపై ఈ కేసును పెడుతున్నారు. ఈ సెక్షన్ కింద ఇప్పటికే ఎంతో మందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో, ఈ సెక్షన్ పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ సెక్షన్ ను రద్దు చేయాలని కోరుతూ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్జీ వొంబాత్కరే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారించింది. విచారణ సందర్భంగా సీజేఐ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సెక్షన్ 124ఏ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతోందని చెప్పారు. ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఈ సెక్షన్ ను వాడగలుగుతారని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణచి వేయడానికి ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని చెప్పారు. ఈ కేసుల్లో శిక్షలు పడిన సందర్భాలు చాలా తక్కువని అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధులను అణచి వేయడానికి ఎప్పుడో బ్రిటీష్ వలస పాలకులు తీసుకొచ్చిన ఈ చట్టం ఇంకా అవసరమా? అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. పాత కాలపు, పనికిమాలిన చట్టాలను తొలగించిన కేంద్ర ప్రభుత్వం… ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్లడం లేదని అన్నారు. ఈ చట్టం వల్ల వ్యక్తులకు, వ్యవస్థలకు తీరని నష్టం వాటిల్లుతోందని చెప్పారు. 124ఏ చట్టాన్ని రద్దు చేయాలని ఎటిటర్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్ తో పాటు, ఇతర పిటిషన్లన్నింటినీ కలిపి ధర్మాసనం విచారిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసిందని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: