తనతో సెల్ఫీ దిగాలంటే రూ.100 చెల్లించాలంటున్న మధ్యప్రదేశ్ మంత్రి…

తనతో సెల్ఫీ దిగాలంటే రూ.100 చెల్లించాలంటున్న మధ్యప్రదేశ్ మంత్రి…
-మంత్రి ఉషా ఠాకూర్ ఆసక్తికర నిర్ణయం
-ఆ డబ్బును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని వెల్లడి
-ఇకపై పూల బొకేలు స్వీకరించబోనని స్పష్టీకరణ
-పూలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని సూచన

సోషల్ మీడియా యుగంలో సెల్ఫీ ఎంత పాప్యులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ఉషా ఠాకూర్ సెల్ఫీని ఎలా ఉపయోగించుకుంటున్నారో చూడండి! తనతో సెల్ఫీ దిగాలటే ఎవరైనా రూ.100 చెల్లించాల్సిందేనని ఓ నిబంధన విధించారు. తనతో సెల్ఫీలకు మద్దతుదారులు పోటీ పడుతుండడంతో ఆమె ఈ షరతు తీసుకువచ్చారు. అయితే, ఆ రూ.100ను పార్టీ పరమైన కార్యక్రమాలకే వినియోగిస్తామని మంత్రి ఉషా ఠాకూర్ చెబుతున్నారు. తమ పార్టీ స్థానిక విభాగానికి రూ.100 చెల్లించిన తర్వాతే తాను సెల్ఫీ ఇస్తానని వెల్లడించారు. అంతేకాదు, ఇకపై తాను పూల బొకేలు తీసుకోబోనని ఆమె స్పష్టం చేశారు.

“మనందరం ఎవరికైనా స్వాగతం పలికేటప్పుడు పూలు ఉపయోగిస్తాం. ఎందుకంటే పువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాం. అయితే సర్వ పాప హరణం చేసే మహావిష్ణువుకు మాత్రమే ఆ పూలను స్వీకరించే హక్కు ఉంటుంది. అందుకే ఇకపై నేను పూలు స్వీకరించబోను. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే చెప్పారు. పూల బొకేలు వద్దు… బుక్స్ కావాలి అన్నారు. మనం గనుక పుస్తకాలను సేకరించగలిగితే పార్టీ ఆఫీసులోనే ఓ గ్రంథాలయం ఏర్పాటు చేయొచ్చు, ఆ పుస్తకాలను ఎవరికైనా దానం చేయొచ్చు” అని ఉషా ఠాకూర్ వివరించారు.

మధ్యప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉషా ఠాకూర్ ఇటీవలే మరో విషయంలోనూ వార్తల్లోకెక్కారు. ప్రజలు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత పీఎం కేర్స్ ఫండ్ కు రూ.500 చొప్పున విరాళం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

%d bloggers like this: