వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…

వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…
మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్ తో రేవంత్ రెడ్డి భేటీ
కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేస్తున్నామన్న రేవంత్
తెలంగాణ దారితప్పిందని వ్యాఖ్యలు
దేవేందర్ గౌడ్ రాజకీయ విలువలకు ప్రతిరూపమని వెల్లడి
ఆయన సూచనలు, సలహాలు అవసరమని వివరణ

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్ళుతున్నారు. ఇప్పటికే పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరిని కలిసి వారి సహకారాలు కావాలని కోరిన ,రేవంత్ రెడ్డి ఇతర పార్టీలలోని పెద్దలను ప్రత్యేకంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న దేవేందర్ గౌడ్ లాంటి వారిని కూడా కలుస్తున్నారు. దీని ద్వారా ఆయన రాష్ట్ర రాజకీయాలలో తన వ్యూహాన్ని చెప్పకనే చెప్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆయన చేస్తున్న కృషికి ప్రజలలో మంచి స్పందనే కనపడుతునందనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం జరిగింది. హైదరాబాదులో మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో అందరినీ కలుపుకుంటూ పోతామని, ఈ కార్యాచరణలో భాగంగానే దేవేందర్ గౌడ్ ను కలిశామని స్పష్టం చేశారు. రాజకీయ విలువలకు ప్రతిరూపం వంటి వ్యక్తి దేవేందర్ గౌడ్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేసిన నేత అని, ఆయన ఆశీస్సులు తమకు అవసరం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ దారితప్పిందని, రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే అలాంటి వారి సూచనలు, సలహాలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వాస్తవానికి కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన ప్రప్రథమంగా చేసింది దేవేందర్ గౌడ్ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాగా, రేవంత్ రెడ్డితో పాటు దేవేందర్ గౌడ్ ను కలిసిన వారిలో పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, పీసీసీ ప్రచార కమిటీ చీఫ్ మధుయాష్కీ గౌడ్ కూడా ఉన్నారు.

Leave a Reply

%d bloggers like this: