ఆ సమాచారంతోనే జయలలితకు దూరమయ్యా: శశికళ!

ఆ సమాచారంతోనే జయలలితకు దూరమయ్యా: శశికళ
-ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని నాకు ముందే తెలుసు
-పథకం ప్రకారమే పోయెస్ గార్డెన్ నుంచి బయటకు వచ్చా
-అన్నాడీఎంకే ఒక్కటి కావడంలో నా పాత్ర కూడా ఉంది
-జయ మిమిక్రీ చేసేవారు

తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత నెచ్చెలి శశికళ పలు విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా జయలలితకు తాను ఎందుకు దూరమైందీ వివరించారు. జయలలితకు, తనకు మధ్య చిచ్చు పెట్టే కుట్ర జరుగుతోందని తనకు సమాచారం అందిందని, కుట్రదారులు ఎవరో తెలుసుకోవాలని జయలలిత అనుకున్నారని శశికళ తెలిపారు. అందులో పథకం ప్రకారమే తాను 2011లో పోయెస్ గార్డెన్‌ను వదలాల్సి వచ్చిందన్నారు. జయలలిత తనకు ఒక సెల్‌ఫోన్ ఇచ్చి తరచూ మాట్లాడేవారని గుర్తు చేశారు. తాను బయటకు వెళ్లే రోజు ఒకటి వస్తుందని అంతకు నాలుగు నెలల క్రితమే తనకు తెలుసన్నారు.

అప్పట్లో రెండు వర్గాలుగా ఉన్న అన్నాడీఎంకే ఒక్కటి కావడంలో తన పాత్ర కూడా ఉందన్నారు. ఎంజీఆర్ స్థాపించిన పార్టీని కాపాడుకునేందుకు, కొందరి స్వార్థ ప్రయోజనాల కారణంగానే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని ఎంజీఆర్ భార్య జానకీరామచంద్రన్ అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఎంజీఆర్ మరణానంతరం పార్టీలో తాను విస్మరణకు గురైన భావన జయలలితలో కనిపించిందన్నారు.

అప్పుడప్పుడు జయ మిమిక్రీ చేసేవారని, పాటలు కూడా పాడేవారని ఆమె తెలిపారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు బాగా చూసేవారని, ముఖ్యంగా కత్తి యుద్ధం సీన్లు అంటే జయకు చాలా ఇష్టమని శశికళ చెప్పుకొచ్చారు. కొడనాడు ఎస్టేట్‌ బంగ్లాలో తాను, జయ కలిసి ఎన్నో సినిమాలు చూశామన్నారు. తమ ఇద్దరి ఆరాధ్యదైవం ఆంజనేయ స్వామేనని శశికళ వివరించారు.

Leave a Reply

%d bloggers like this: