పార్లమెంట్ లో పెగాసస్ సెగలు.. మోడీ టార్గెట్ గా విపక్షాల ఉమ్మడి పోరు…

పార్లమెంట్ లో పెగాసస్ సెగలు.. మోడీ టార్గెట్ గా విపక్షాల ఉమ్మడి పోరు…
-పార్లమెంట్ స్తంభన …పలుమార్లు వాయిదా పడ్డ ఉభయసభలు
-కాంగ్రెస్ ,టీఎంసీ పెగసెస్ పై విచారణకు పట్టుపట్టాయి
-దీనిపై ప్రధాని మోడీ భాద్యత వహించాలి
-హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి

దేశవ్యాపంగా సంచలనం సృష్టించిన పెగాసస్ ప్రకంపనలు పార్లమెంట్ ను షేక్ చేస్తున్నాయి. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ సహా మూడు వందల మంది ఫోన్లపై నిఘా పెట్టారన్న ఆరోపణలను విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. సోమవారం పార్లమెంట్ లో ఆందోళన చేసిన ప్రతిపక్షాలు.. దీనిపై మరింతగా పోరాడాలని నిర్ణయించాయి. మంగళవారం కీలక సమావేశం నిర్వహించబోతున్నాయి. ఫోన్లపై నిఘా పెట్టడం దారుణమంటున్న విపక్షాలు.. ప్రధాని మోడీని బాధ్యత వహించాలని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి..
తాజాగా ‘పెగాసస్‌’ హ్యాకింగ్‌ బాధితుల జాబితాలో మరికొందరి పేర్లు బయటపడ్డాయి. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, వివిధరాష్ట్రాల్లో బీజేపీకి గెలుపును దూరం చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఫోన్లు, ప్రహ్లాద్‌ పటేల్‌ సన్నిహితులకు చెందిన 18నంబర్లు కూడా హ్యాక్‌ అయ్యాయని ‘ద వైర్‌’ వార్తా సంస్థ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ అశోక్‌ లావాసా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, ప్రముఖ వైరాలజిస్టు గగన్‌ దీప్‌ కాంగ్‌, ఎన్నికల వాచ్‌డాగ్‌ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌)’ వ్యవస్థాపకుడు జగ్‌దీప్‌ చోఖర్‌.. ఇలా చాలా మంది పెగాసస్‌ నిఘా నీడన ఉన్నారని పేర్కొంది. ఎవరెవరి ఫోన్లు ఎప్పుడెప్పుడు హ్యాకింగ్‌కు గురయ్యాయో కూడా తెలిపింది.

 

తమను విమర్శించేవారిపై నరేంద్ర మోడీ సర్కారు నిఘా పెట్టిందని.. ఇందుకోసం ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎ్‌సవో రూపొందించిన ‘పెగాసస్‌’ స్పైవేర్‌ను ఉపయోగించిందని అమెరికాకు చెందిన ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఉగ్రవాద కార్యకలాపాలను పసిగట్టి, చర్య తీసుకునేందుకు ఉపయోగించాల్సిన ఈ నిఘా పరికరాల్ని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మానవహక్కుల సంఘాలపై ప్రయోగించిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ జర్నలిస్టులు జోవాన్నాస్లేటర్‌, నీహా మహిష్‌ తమ కథనంలో పేర్కొన్నారు. ఇక ద వైర్ కథనం ప్రకారం.. రాహుల్‌ గాంధీపై 2018 మే,జూన్‌ నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కూడా నిఘా పెట్టారు. రాహుల్‌ ఉపయోగించిన రెండు నంబర్లతో పాటు ఆయన స్నేహితుల్లో ఐదుగురికి, పార్టీ విషయాల్లో ఆయనతో సన్నిహితంగా పనిచేసే ఇద్దరు సహాయకులు అలంకార్‌ సవాయ్‌, సచిన్‌రావుకు సంబంధించిన తొమ్మిది నంబర్లపై నిఘా పెట్టారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమయంలో ప్రశాంత్‌కిశోర్‌ ఫోన్‌ను పెగాసస్‌ స్పై వేర్‌ ద్వారా హ్యాక్‌ చేసినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ నిర్వహించిన డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలిం ది.
2019ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘన కేసులో ప్రధాని మోడీకి.. అప్పటి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోడా క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై అసమ్మతి వ్యక్తం చేయడం ద్వారా అశోక్‌ లావాసా వార్తల్లోకి వచ్చారు. అప్పుడే ఆయన ఫోన్‌పై పెగాసస్‌ ద్వారా నిఘా పెట్టారు. ఇటీవలే కొత్తగా మోడీ కేబినెట్‌లో ఐటీ, రైల్వే శాఖల బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఫోన్‌ కూడా 2017లో హ్యాకింగ్‌కు గురైంది. అప్పుడు ఆయన గుజరాత్‌లో మూడు కంపెనీలకు డైరెక్టర్‌. టెక్నాలజీకి సంబంధించి మోడీ నిర్ణయాల వెనుక కీలకంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన స్టాఫర్‌కు, ఆమె బంధువులకు చెందిన 11 నంబర్లపై 2019 ఏప్రిల్‌లో (ఆరోపణలు చేసిన సమయంలో) పెగాసస్‌ నిఘా ఉన్నట్టు ‘ద వైర్‌’ వెల్లడించింది. ప్రముఖ వైరాలజిస్టు గగన్‌ కాంగ్‌ ఫోన్‌ను 2018లో కేరళను నిఫా వైరస్‌ కుదిపేస్తున్నప్పుడు హ్యాక్‌ చేశారట..

Leave a Reply

%d bloggers like this: