Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సింగరేణిలో పట్టుకోసం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మస్త్రంగా సీతక్క…

సింగరేణిలో పట్టుకోసం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మస్త్రంగా సీతక్క
-రేవంత్ స్ట్రాటజీ… కవితకు పోటీగా రంగంలోకి
-కోల్ బెల్ట్ లో పరిచయాలు కలిసివస్తాయనే అభిప్రాయం
-సీతక్క క్లిన్ ఇమేజ్ కలిసొస్తుందని ఆశాభావం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క గేర్ మార్చినట్టుగా కనిపిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దూకుడు పెంచిన సీతక్క ఇప్పుడు మరింత జోష్ తో ముందుకు వెళుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ముఖ్యంగా తన నియోజకవర్గ పరిధిలో గిరిజన గూడేల ప్రజల సంక్షేమానికి పని చేసిన సీతక్క ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన ఫోకస్ పెడుతున్నారు.

ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలలో కూడా పెద్దగా పాల్గొనని సీతక్క, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి దూకుడు చూపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా పెద్దగా యాక్టివ్ రోల్ తీసుకోని సీతక్క ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు సీతక్క తన మార్కు పాలిటిక్స్ లో కీ రోల్ పోషించనున్నారు.

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, రేవంత్ వర్గంగా భావించే సీతక్క కీలక పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. అనుకున్నట్టే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో సీతక్కకు ప్రాధాన్యతనిస్తూ రేవంత్ రెడ్డి ఆమెను ప్రజాక్షేత్రంలో ముందుకు నడిపించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సింగరేణిలో పట్టు సాధించడం కోసం తెలంగాణ ఐరన్ లేడీ గా పేరున్న, నిరాడంబరంగా ఉండే నాయకురాలిగా ప్రజాక్షేత్రంలో మంచి గుర్తింపు ఉన్న సీతక్క ను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది.

తెలంగాణలో దాదాపు సగం వరకు సింగరేణి ప్రాంతం ఉంది. కోల్ బెల్ట్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేని కారణంగా సింగరేణి పై పట్టు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. సింగరేణి ఎన్నికల బాధ్యతను ఆమెకి అప్పగిస్తారని, కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి ని గెలిపించే బాధ్యత సీతక్క భుజస్కంధాలపై పెడతారని తెలుస్తుంది. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో సీతక్కకు ఉన్న పాత పరిచయాలు, రాజకీయాల్లో ఆమెకు ఉన్న క్లీన్ ఇమేజ్ సింగరేణిలో పట్టు సాధించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ముఖ్యంగా భూపాలపల్లి, ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం, గోదావరిఖని, మందమర్రి, మంచిర్యాల, చెన్నూరు, రామగుండంలలో సీతక్క పట్టు సాధిస్తారని అంచనా వేస్తున్నారు. ఒకపక్క టిఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపు కోసం ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు అయిన కవిత వ్యూహరచన చేస్తుండగా, కవిత కు పోటీగా, ధీటుగా క్లీన్ ఇమేజ్ ఉన్న సీతక్క ను రంగంలోకి దించడం కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ. కవితను సీతక్క సమర్ధంగా ఎదుర్కోగలదని కాంగ్రెస్ తెలంగాణా బాస్ అంచనా.

ఏది ఏమైనా కరోనా కష్టకాలంలో గిరిజనులకు బాసటగా నిలిచిన ఎమ్మెల్యే సీతక్క దేశవ్యాప్త ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అదే క్లీన్ ఇమేజ్ తో మళ్లీ మరోమారు బొగ్గు గనుల్లో పాగా వేయడానికి రేవంత్ సంధించిన అస్త్రం గా సీతక్క సింగరేణి పై ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రయత్నంలో సీతక్క సక్సెస్ అయితే తెలంగాణా రాష్ట్ర రాజకీయాలలో సీతక్క కీలకంగా మారతారు. మరి సీతక్క కవితను ఓడిస్తారా ? కాంగ్రెస్ ను గెలిపిస్తారా లేదా ? అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది.

Related posts

రాహుల్ తో కలిసి నడిచిన మహాత్మాగాంధీ ముని మనవడు!

Drukpadam

నేను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో చేసింది: ఏపీ మంత్రి కాకాణి!

Drukpadam

పవన్ కళ్యాణ్ ఇజ్జత్ కా సవాల్ తిరుపతి ఉపఎన్నిక

Drukpadam

Leave a Comment