ఖమ్మం లో వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ…

ఖమ్మం లో వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ.
-అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.

ఈ మేరకు ఖమ్మం కాల్వఒడ్డు మున్నేరు పరివాహక ప్రాంతంను మేయర్ పునుకొల్లు నీరజ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి తో కలిసి మంత్రి పువ్వాడ సందర్శించారు. మున్నేరు వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. వరద ముంపు ప్రాంతాల వారిని ఇప్పటికే స్థానిక నాయబజార్ కళాశాలలో పునరావాసం కల్పించినట్లు మీడియాకు వెల్లడించారు. వారికి భోజనం, త్రాగునీరు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ఉధృతిపై సహాయక చర్యలకై అన్ని ఏర్పాట్లుచేశామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగలేదని, అయినప్పటికీ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడమైందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా నేపథ్యంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు తెలుసుకుని తగు చర్యలకు సూచనలు ఇస్తున్నామన్నారు.

రానున్న మరో రెండుమూడు రోజులు కూడా భారీగా వానలు పడే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ వారి హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్ర స్థాయి అధికారులు స్థానికంగా ఉండేలా చూడాలని ఆదేశించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పొంగుతున్న వాగుల వద్ద తగు హెచ్చరికలను, వేరే దారులను సూచించే గుర్తులు ఏర్పాటు చేయాడం జరిగిందన్నారు.

గ్రామాల్లోనూ పాత ఇండ్లలో ఉన్నవారిని గుర్తించి సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచనలు చేశామన్నారు. అదేవిధంగా వర్షకాలంలో గ్రామాల మధ్య ఉన్న చిన్నచిన్న వాగులను దాటేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో కూడా వరద ఉదృతిని మంత్రి పరిశీలించారు , అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వరద ఉధృతి, సహాయక చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు . కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు , అధికారులు పాల్గొన్నారు .

Leave a Reply

%d bloggers like this: