మోత్కుపల్లి కషాయానికి గుడ్ బై … గులాబీ గూటికి సై….

మోత్కుపల్లి కషాయానికి గుడ్ బై … గులాబీ గూటికి సై….
-బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్ లో చేరిక!
-బండి సంజయ్ కు పంపిన రాజీనామా లేఖ
-ఈటలను మోయాల్సిన అవసరం బీజేపీకి ఏమొచ్చిందని మండిపాటు
-అన్ని కోట్ల ఆస్తులు ఎలా కూడా బెట్టారని వ్యాఖ్య
-ఈటల ఒక అవినీతిపరుడని వ్యాఖ్య

సీనియర్ రాజకీయనాయకుడు మోత్కుపల్లి నరసింహులు బీజేపీ లో కాపురం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది … దళిత సాధికారత పై బీజేపీ కి ఆయనకు మధ్య గ్యాప్ వచ్చిందని చెపుతున్నప్పటికీ అంతకు ముందు నుంచే ఆయన బీజేపీ తో అంత సఖ్యంగా లేరు . ఆయనకు ఎస్సీ నాయకుడిగా తెలంగాణలో మంచి పేరుంది. బీజేపీ లో చేరుతున్న సందర్భంగా టీఆర్ యస్ ను రాష్ట్రంలో బొందపెట్టాలనే ఉద్దేశంతో చేరారు. కానీ బీజేపీ పార్టీ ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వలేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. బీజేపీ అభిప్రాయానికి విరుద్ధంగా ఆయన కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత సాధికారిత సమావేశానికి హాజరు కావడం పార్టీ నాయకత్వం తో గ్యాప్ ఏర్పడటానికి కారణమైంది .పైగా ఆయన సమావేశానికి వెళ్లడం బీజేపీ కి మంచి జరుగుతుందని ప్రచారం చేశారు. అదికూడా వారికీ నచ్చలేదు. దీంతో గత కొంతకాలంగా ఆయన బీజేపీ కి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీ కండువాను పక్కన వేసి గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైయ్యారు. అందువల్ల ఆయన బీజేపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

శుక్రవారం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపానని చెప్పారు. టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోబోతున్నట్టు రాష్ట్ర బీజేపీ నేతలు తనతో ఒక్కమాట కూడా చెప్పలేదని మండిపడ్డారు. ఈటలను పార్టీలో చేర్చుకోవడం తనను బాధించిందని అన్నారు.

అసలు రాజేందర్ ను నెత్తిన మోయాల్సిన అవసరం బీజేపీకి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈటల ఒక అవినీతిపరుడని వ్యాఖ్యానించారు. దళితుల భూములను ఈటల ఆక్రమించుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. వేల కోట్ల రూపాయలను ఈటల కూడబెట్టారని అన్నారు. ఈటలకు ఇంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో ఈటలను ఓడించేందుకు దళితులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని బీజేపీ ఉపయోగించుకోలేదని మోత్కుపల్లి మండిపడ్డారు. కనీసం బీజేపీ కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలను చెప్పాలని ఆహ్వానించారని… బండి సంజయ్ కు చెప్పే తాను ఆ సమావేశానికి వెళ్లానని.. అయినా పార్టీలో వ్యతిరేక అభిప్రాయాలు రావడం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఒక పథకాన్ని తాను ప్రశంసించడం బీజేపీ నేతలకు మింగుడుపడలేదని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: