అమరావతి అనేది ఓ కుంభకోణమని అందరికీ తెలుసు: సజ్జల!

అమరావతి అనేది ఓ కుంభకోణమని అందరికీ తెలుసు: సజ్జల
ఇటీవల ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో సుప్రీం తీర్పు
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని వెల్లడి
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న సజ్జల
తమ ప్రభుత్వ అభిప్రాయం అదేనని వెల్లడి
రాజీనామాలు చేయడం వారి ఇష్టం.. మమ్మల్ని అడగడం ఎందుకు?: సజ్జల
గతంలో మేము రాజీనామాలు చేసినప్పుడు టీడీపీని అడిగామా?
టీడీపీ హయాంలో ఎంత మంది సలహాదారులు ఉండేవారనే లెక్కలు తీస్తున్నాం

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదన్న హైకోర్టు తీర్పును ఇటీవలే సుప్రీంకోర్టు కూడా బలపర్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఓ కుంభకోణమని అందరికీ తెలుసని అన్నారు. తమ ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పునరుద్ఘాటించారు. అమరావతి కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో సాంకేతిక అంశాలపై ఆధారపడే కోర్టు తీర్పు వచ్చిందని, ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం ఉపయోగించడం సాంకేతికంగా అభ్యంతరకరం అయితే, మరో కోణంలో వాస్తవాలు వెలుగుచూస్తాయని సజ్జల పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లు మాత్రం తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం రాజీనామాలు చేసేందుకు తాము సిద్ధమని, వైసీపీ ఎంపీలు సిద్ధమా? అని టీడీపీ ఎంపీలు సవాల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వారి ఇష్టమని… మమ్మల్ని అడగటం ఎందుకని ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేశామని… అప్పుడు టీడీపీ వాళ్లను అడిగామా? అని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంత మంది ప్రభుత్వ సలహాదారులు, కన్సల్టెంట్లు ఉండేవారనే లెక్కలు తీస్తున్నామని సజ్జల చెప్పారు. ఆ రోజుల్లో కుటుంబరావు, పరకాల ప్రభాకర్ వంటివారు రాజకీయాలు మాట్లాడారని… అప్పుడు అది తప్పుగా అనిపించలేదా? అని ప్రశ్నించారు. అమరావతి భూవ్యవహారం పెద్ద స్కామ్ అని… ఆ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనే విషయం కూడా అందరికీ తెలుసని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఉపయోగించడం వల్ల సాంకేతికంగా సమస్య ఉత్పన్నమైందని, అందువల్లే సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని అన్నారు. అయితే వాస్తవాలు మరో కోణంలో బయటకు వస్తాయని.. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: