లోకసభ సీట్లను 1000 కి పెంచనున్నారా?

లోకసభ సీట్లను 1000 కి పెంచనున్నారా?
-బీజేపీ లోకసభ సీట్లను పెంచే ప్రతిపాదన చేస్తుందన్న కాంగ్రెస్ నేత మనీష్ తివారి
-సీట్లు పెంచితే బీజేపీకి కలిసొస్తుందని మోడీ ఆలోచన
-పార్లమెంట్ నూతన భవనాన్ని 1000 సీట్లతో నిర్మిస్తున్నారన్న తివారి
-దేశ రాజకీయాల్లో ప్రకంపనలు …
-కేసీఆర్ ,జగన్ లు కింగ్ మేకర్లు కానున్నారా ?

జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అప్పుడే వ్యూహాలు మొదలయ్యాయి. 2024 నాటికి పదేళ్లు అధికారం పూర్తి చేసుకోనున్న బీజేపి తిరిగి తామే కొనసాగే విధంగా కొత ప్రతిపాదనలు..వ్యూహాలకు పదును పెడుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తమయ్యాయి. మమతా బెనర్జీ-ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ మోదీ వ్యతిరేక కూటమిని ఇప్పటి నుంచే బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ రోజు నుంచి మమతా వారం పాటు ఢిల్లీలోనే మకాం వేస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య కేంద్రం అనూహ్య నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 1000కి పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్‌ మనీశ్‌ తివారీ వెల్లడించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఈ ప్రకటన ప్రకపంనలకు కారణమవుతోంది. 2024 ఎన్నికలకు ముందే ఇది జరిగేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందుకు సంబంధించి తనకు పార్లమెంటులోని సహచరుల నుంచి సమాచారం అందిందని తివారీ వెల్లడించారు. పార్లమెంటు నూతన భవనాన్ని కూడా 1000 సీట్లతో నిర్మిస్తున్నారని తెలిపారు. అయితే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అందరితోనూ సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నారు.

వాస్తవానికి లోక్‌సభ సభ్యుల సంఖ్యను వెయ్యికి పెంచాల్సిన అవసరం ఉందంటూ దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2019లోనే చెప్పారని గుర్తు చేశారు. బ్రిటన్‌లో 650 మంది, కెనడాలో 443 మంది, అమెరికాలో 535 మంది సభ్యులు ఉన్నప్పుడు.. ఇంత పెద్ద జనాభా ఉన్న భారత్‌లో 543 నుంచి 1000కి ఎందుకు పెంచకూడదని ప్రణబ్‌ ప్రశ్నించారని పేర్కొన్నారు. 2024 నాటికి పదేళ్ల పాలన పూర్తి చేసుకొనే తమ ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని..కానీ, అది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారకుండా..రాజకీయంగా కొత్త నిర్ణయాలకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ రెండు పార్టీలకు..కలిసొచ్చే అవకాశం ….

లోక్ సభలో సీట్లు పెరిగితే ఉత్తర ప్రదేశ్..బీహార్.. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య మిగిలిన వాటి కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే వాదన మొదలైంది. దక్షిణాది నుండి డీఎంకే- వైసీపీ-టీఆర్ఎస్ బలమైన పార్టీలు పార్లమెంట్ లో ఉన్నాయి. వైసీపీ 22 మంది..టీఆర్ఎస్ 9 మంది సభ్యులు ఉన్నారు. లోక్ సభ సీట్ల సంఖ్య పెంచితే..తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు విభజన చట్టం ప్రకారం పెరగాల్సి ఉంది. దీంతో..లోక్ సభ- అసెంబ్లీ సీట్లు పెరిగితే తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవైసీపీ -టీఆర్ఎస్ కు ఎక్కువగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే వాదన మొదలైంది.

రెండు రాష్ట్రాల్లోనూ రెండు అధికార పార్టీలు బలంగా ఉన్నాయి. సీట్లు పెరిగినా..వారే అనుకూలంగా మలచుకొనే అవకాశం ఉంది. ఈ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ -బీజేపీ బలం పెరుగుతుందా అనేది ఇంకా స్పష్టత రావటం లేదు. ఇక, టీడీపీ సైతం తెలుగు రాష్ట్రాలోనూ-జాతీయ రాజకీయాల్లోనూ సత్తా చాటినా, ఇప్పుడు తెలంగాణలో పూర్తిగా బలహీన పడింది. ఏపీలోనూ ఇప్పటికైతే వైసీపీదే పైచేయి గా కనిపిస్తోంది. ఇక, లోక్ సభ సీట్లు ఇంత పెద్ద సంఖ్యలో పెరగటం ద్వారా ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అవుతుందని విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.

అదే జరిగితే జాతీయ రాజకీయాల్లో ఎవరు అధికారంలోకి రావాలన్నా.. ప్రాంతీయ పార్టీల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఎంపీలు ఉన్న పార్టీ అధినేతలు కింగ్ మేకర్లు కానున్నారు. ఆ లెక్కన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదన చట్ట సవరణ ద్వారా అమలు జరిగితే కీలకం కానున్నారు. దీనికి చట్ట సవరణ కోసం కేంద్రం సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో..ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల పైన ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు ఫోకస్ పెట్టారు. అదే విధంగా ఎన్నికల బరిలో నిలవాలని ఆశించే వారిలోనూ ఈ ఆలోచన మరింత ఉత్కంఠ పెంచుతోంది.

Leave a Reply

%d bloggers like this: