సీఎం సహా వీఐపీలు వచ్చిన వేళ.. ఉజ్జయిని మహంకాళేశ్వర్​ ఆలయంలో తొక్కిసలాట!

సీఎం సహా వీఐపీలు వచ్చిన వేళ.. ఉజ్జయిని మహంకాళేశ్వర్​ ఆలయంలో తొక్కిసలాట!
-తోసుకుంటూ లోపలికెళ్లిన భక్తులు
-కింద పడిపోయిన కొందరు
-మహిళలు, పిల్లలకు గాయాలు

అసలే భక్తులు పోటెత్తారు. ఆ సమయంలోనే వీఐపీలూ వచ్చారు. పోలీసులు భక్తులను ఆపేశారు. సహనం నశించిన భక్తులు తోసుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. దీంతో తొక్కిసలాట లాంటి పరిస్థితులు తలెత్తాయి. కొందరు కింద పడ్డారు కూడా. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళేశ్వర్ ఆలయంలో నిన్న జరిగింది.

ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. అందులో మహిళలు, చిన్నారులూ ఉన్నారు. భక్తులు పోటెత్తడంతో పాటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి వంటి ముఖ్యులు మహంకాళేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చారు. అయితే, అప్పటికే పోటెత్తిన భక్తులను నియంత్రించడం అక్కడ భద్రతగా ఉన్న పోలీసులవల్ల కాలేదు.

గేట్ నంబర్ 4 నుంచి భక్తులు తోసుకుంటూ లోపలికెళ్లే ప్రయత్నం చేశారు. బయటకెళ్లేవారినీ తోసుకుంటూ వచ్చేశారు. ఈ క్రమంలో ఓ భక్తుడు తోసుకొస్తున్న వారిపై చేయి చేసుకున్నాడు. అయినా వారు ఆగలేదు. దీంతో పిల్లలు సహా కొందరు కిందపడిపోయారు. ఘటనపై స్పందించిన ఉజ్జయిని కలెక్టర్ ఆశిష్ సింగ్.. వచ్చే సోమవారం ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు.

12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినికి.. సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారన్నారు. వాస్తవానికి ఒక్కరోజులో కేవలం 3,500 మంది భక్తులకే అనుమతినిస్తామని అంతకుముందు ఆలయ అధికారులు చెప్పారు. అది కూడా ప్రతి రెండు గంటలకు 500 మందినే లోపలికి పంపిస్తామన్నారు. వచ్చే వారికి కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. అది కాకుండా కనీసం ఒక డోసైనా వ్యాక్సిన్ వేసుకున్న వారినే అనుమతిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: