దేవినేని ఉమ వాహనంపై రాళ్లదాడి… చంద్రబాబు పరామర్శ!

దేవినేని ఉమ వాహనంపై రాళ్లదాడిచంద్రబాబు పరామర్శ!
కొండపల్లి ప్రాంతంలో మైనింగ్
అక్రమ మైనింగ్ అంటూ ఉమ ఆరోపణలు
మైనింగ్ పరిశీలించి వస్తుండగా దాడి
కారు అద్దాలు ధ్వంసం
వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్ తీరుతెన్నులను పరిశీలించి వస్తున్న ఉమ వాహనాన్ని గడ్డ మణుగ గ్రామం వద్ద వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వాహనాన్ని చుట్టుముట్టిన కొందరు వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఉమ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఈ ఘటనపై దేవినేని ఉమ తీవ్రంగా స్పందించారు. తనపై దాడి చేసిన వాళ్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులని ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… ఉమకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి దాడులతో భయపడేదిలేదని స్పష్టం చేశారు. వైసీపీపై తమ పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు.

కాగా, ఈ ఘటన నేపథ్యంలో, భద్రత కల్పించడంలో పోలీసుల విఫలం అయ్యారని దేవినేని ఉమ విమర్శలు చేశారు. ఈ క్రమంలో జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

జగన్ కనుసన్నల్లోనే తనపై దాడి దేవినేని ఉమ

దాడి జరిగి ఇంతసేపైనా పోలీసు అధికారులు రాలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పూర్తిగా జగన్‌ కనుసన్నల్లో, సజ్జల నాయకత్వంలో తనపై దాడి జరిగిందని ఆరోపించారు. వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తనపై రాళ్లురువ్వారని మండిపడ్డారు. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీ జరిగిందన్నారు. నిర్వాసితుల పక్షాన మాట్లాడుతున్నానని తనపై కక్షగట్టారని ఆరోపించారు. తన అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు. గ్రావెల్ దోపిడీపై ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా..? అని ఉమ  ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు సురక్షితంగా తనను పీఎస్‌కు తీసుకెళ్తున్నారని చెప్పారు. పీఎస్‌కు రెండు కి.మీ. దూరంలో దాడి జరిగినా పోలీసులు రాలేదని ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతోందన్నారు. దాడిపై డీజీపీ, విజయవాడ సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. 

 

దేవినేని ఉమపై దాడిని ఖండిస్తూ డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఎలుగెత్తుతున్న దేవినేని ఉమపై ఇవాళ గడ్డ మణుగు గ్రామం వద్ద దాడి జరిగింది. దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దేవినేని ఉమపై దాడిని ఖండిస్తూ డీజీపీకి లేఖ రాశారు. రెండేళ్లుగా రాష్ట్రంలో మాఫియా, గూండాగిరి పెరిగిందని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం, పోలీసులు కలిసి ప్రజల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమ, టీడీపీ కార్యకర్తలపై దాడే అందుకు ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. దేవినేని ఉమ కారుపై రాళ్లు విసిరి, కారును ధ్వంసం చేశారని ఆరోపించారు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లినా ఎవరినీ అరెస్ట్ చేయలేదని డీజీపీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. అమరావతి పరిసరాల్లో ఇలాంటి ఘటన జరగడం దారుణమని పేర్కొన్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని రాళ్ల దాడి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేవినేని ఉమకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు

Leave a Reply

%d bloggers like this: