ప్రతిపక్షాల ఐక్యతకు హస్తినలో మమతా కుస్తీ…

ప్రతిపక్షాల ఐక్యతకు హస్తినలో మమతా కుస్తీ…
-ఢిల్లీ లో మకాం …పలువురు నేతలతో వరస భేటీలు
-ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు
-జగన్ , పై సోనియా ఆరా …
-జగన్ మావాడే అన్న మమతా
– కేసీఆర్, నవీన్ పట్నాయక్ లతో మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడి

టార్గెట్ 2024 ….. అప్పటికల్లా దేశంలో ఉన్న ప్రతిపక్షాలను ఏకం చేయాలనీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆమె అనేకం మంది ప్రతిపక్ష నేతలను కలుస్తున్నారు. బీజేపీని కేంద్రంలో గద్దె దింపటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇటీవల బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని హోమ్ మంత్రి లాంటి ఉద్దండులు బెంగాల్ లో పర్యటించి మమతా ను గద్దెదించటమే లక్ష్యం గా పనిచేశారు. మమత ఓడిపోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అనేకమంది టీఎంసీ ఎంపీ లను ,ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి బీజేపీ లో చేర్చుకున్నారు. దీంతో మమతా పని అయిపోయిందని అనుకున్నారు. కానీ ఆమె ఒంటరి పోరులోనూ ప్రధాని ,హోమ్ మంత్రి ప్రచారాన్ని తిప్పుకోడుతూ ఘనవిజయం సాధించారు. దింతో ఆమె దృష్టి కేంద్రం పై పడింది. ..

2024 లోక్‌సభ ఎన్నికల సమయానికల్లా బీజేపీని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దేశ రాజధాని హస్తిన లో మకాం వేసిన ఆమె ప్రతిపక్ష పార్టీ లో వరస భేటీలతో బిజీ బిజీ గా ఉన్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం ఆమె కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా పలు బీజేపీయేతర పార్టీ అధినేతలను కలిశారు మమతా బెనర్జీ. ఈ క్రమంలోనే మమతా ఢిల్లీ పర్యటన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకే కారణమవుతోంది.

గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ 2018లో థర్డ్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ పావులు కదిపారు. కేంద్రంలో బీజేపీ-కాంగ్రెస్‌యేతర పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో పలువురు బీజేపీ కాంగ్రెస్ యేతర పార్టీ నాయకులను స్వయంగా వారి రాష్ట్రాలకు వెళ్లి సీఎం కేసీఆర్ కలిశారు. అయితే ఆయన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయి. ఆ సమయంలో మమతా బెనర్జీ కూడా ఒక్కింత వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుండా ఎలా అనే ప్రశ్న ఆమె లేవనెత్తారు. ఇక తాజాగా మరో ప్రయత్నమే దేశ రాజకీయాల్లో జరుగుతోంది. అయితే ఈ సారి బీజేపేయేతర పార్టీల అధినేతలతో మమతా సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం అయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.

ప్రస్తుతం బీజేపీతో జతకట్టనప్పటికీ కేంద్రంలో మద్దతుగా ఉంటున్న వైసీపీ, బీజేడీ లాంటి పార్టీలకు కూడా మమతా బెనర్జీ డోర్స్ ఓపెన్ చేశారు. ఆ రెండు పార్టీలు కూడా బీజేపీపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. ఇదిలా ఉంటే ఈ కూటమిని ఎవరు ముందుండి నడిపిస్తారన్న ప్రశ్నను మమతా బెనర్జీ దాటవేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పాత్ర గురించి కూడా వివరించారు. “ఎన్నికల సమయం నాటికి మోడీ ప్రభుత్వంపై బీజేపీపై పోరాడేందుకు చాలా విపక్ష పార్టీలు ఏకం అవుతాయి. బీజేపీ పార్టీ పరంగా పెద్దదిగా ఉండొచ్చు కానీ రాజకీయ కోణంలో చూస్తే విపక్ష పార్టీలు మరింత బలంగా కనిపిస్తాయి. చరిత్ర సృష్టిస్తాయి” అని దీదీ చెప్పారు.

ఇదిలా ఉంటే సోనియా, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమైన సమయంలో వారంతా వైసీపీ అధినేత జగన్, బీజేడీ నేత నవీన్ పట్నాయక్ గురించి ప్రస్తావించినట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వంకు సరైన సమయంలో జగన్ పార్టీ, నవీన్ పట్నాయక్ పార్టీలు అండగా నిలుస్తున్నట్లు తమ మధ్య చర్చకు వచ్చినట్లు దీదీ తెలిపారు. అయితే వైయస్ జగన్‌తో, నవీన్ పట్నాయక్‌లతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని దీదీ చెప్పారు. భవిష్యత్తులో వీరు కూడా తమతో కలిసొస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక పార్లమెంటులో వైసీపీ ఫ్లకార్డులతో దర్శనం ఇవ్వడం చూస్తుంటే ఆ పార్టీ కూడా మోదీ సర్కార్‌ను క్రమంగా దూరం చేసుకుంటుందా అన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నితీష్ కుమార్ గురించి ప్రస్తావన రాగా తాను బీజేపీని వీడితే అప్పుడు ఆలోచిస్తామని వెల్లడించారు దీదీ.

ప్రస్తుతం సోనియాగాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌, లాలూ ప్రసాద్ యాదవ్‌లతో మాట్లాడినట్లు చెప్పిన దీదీ… భవిష్యత్తులో మరిన్ని చర్చలు సమావేశాలు జరుగుతాయని.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాక చర్చలు వేగవంతం చేస్తామని దీదీ చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ రోజు కాకపోయిన రేపైనా వారంతా తమతో కలిసి వస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు దీదీ. ప్రాంతీయ పార్టీలంతా ఒకే తాటిపైకి వచ్చేందుకు సమయం చాలానే ఉందని ఒక్కసారి ఏకమయ్యాయంటే అది ఒక దళంలా తయారవుతుందని మమతా అన్నారు. ఇక ప్రధాని రేసులో తాను నిలుస్తారా అన్న ప్రశ్నకు దీదీ తెలివిగా సమాధానం చెప్పారు. తాను ప్రజాజీవితంలో ఉంటానని ప్రజల కోసం పనిచేస్తానని అదే కొనసాగిస్తానని చెప్పారు. ఒక నాయకురాలిగా పనిచేయాలనుకోవడం లేదని ఒక కార్యకర్తగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

 

Leave a Reply

%d bloggers like this: