హుజూరాబాద్​ ఉద్రిక్తం.. టీఆర్​ఎస్​, బీజేపీ కార్యకర్తల బాహాబాహీ…

హుజూరాబాద్​ ఉద్రిక్తం.. టీఆర్​ఎస్​, బీజేపీ కార్యకర్తల బాహాబాహీ…
-అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ఈటల జమున
-అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ శ్రేణులు
-ఇరు వర్గాల మధ్య తోపులాట.. పోలీసుల రంగ ప్రవేశం

హుజూరాబాద్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రజాదీవెనయాత్రతో ఈటల రాజేందర్ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. గొర్రెల పంపిణీ, దళితబంధు వంటి పథకాలతో ప్రభుత్వం అక్కడ గెలిచే ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ హుజూరాబాద్ లోని అంబేద్కర్ కూడలిలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

అంబేద్కర్ విగ్రహానికి ఈటల భార్య జమున క్షీరాభిషేకం చేసేందుకు రాగా.. అప్పుడే టీఆర్ఎస్ కార్యకర్తలూ అక్కడకు చేరుకుని, ఆమెను అడ్డగించారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల వారు నినాదాలు హోరెత్తించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ, దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు వచ్చి వారిని నిలువరించారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు.

అయితే, జమున సోదరుడు మధుసూదన్ .. ఎస్సీలను కించపరిచేలా మాట్లాడారంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆయన వ్యాఖ్యలను టీఆర్ఎస్ కార్యకర్తలు ఎత్తిచూపుతున్నారు. అయితే, అవి టీఆర్ఎస్ కార్యకర్తలు సృష్టించిన వీడియోలేనని, నకిలీవని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఈ విషయం మీదే రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.

Leave a Reply

%d bloggers like this: