పెగాసస్ పై విచారణకు సుప్రీం ఓకే…

పెగాసస్ పై విచారణకు సుప్రీం ఓకే…
-పిల్​ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
-వచ్చే వారం విచారిస్తామన్న సీజేఐ ఎన్వీ రమణ
-కపిల్ సిబల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు
-పెగాసస్ నిఘాపై ఈ నెల 27న దాఖలైన పిల్

ప్రస్తుతం పెగాసస్ అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ఈ వివాదాన్నే ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలు సభనూ నడవనివ్వడం లేదు. అన్ని పార్టీలూ ఏకమై నిరసన తెలియజేస్తున్నాయి. ఈ పెగాసస్ తో నిఘా అంశంపై పలువురు జర్నలిస్టులు సుప్రీంకోర్టులో కొన్ని రోజుల క్రితం ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. తాజాగా ఆ పిల్ ను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. వచ్చే వారం విచారిస్తామని తెలిపింది. సీనియర్ లాయర్, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణకు అంగీకారం తెలిపింది.

కొందరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, స్వచ్ఛంద కార్యకర్తలు, పౌర సంఘాల నేతల ఫోన్లపై పెగాసస్ తో నిఘా పెట్టారన్న ఆరోపణలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. దీనిపై సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఈ నెల 27న సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ను కొనుగోలు చేసిందా? లేదా? అన్న విషయాన్ని తెలియజేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని అందులో పిటిషనర్లు కోరారు.

సైన్యం వాడే స్పైవేర్ ను సామాన్య ప్రజల మీద ప్రయోగించడమంటే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఫోన్లపై నిఘా పెట్టడం వ్యక్తిగత జీవితంపై దాడి చేయడమేనని తెలిపారు. ఇది నేరపూరితమైన చర్య అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

%d bloggers like this: