హుజూరాబాద్‌కు రూ. 1000 కోట్లు ఎవరికి గుణపాఠం చెప్పేందుకు?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

బహుజనుల రాజ్యస్థాపనే లక్ష్యం … ఏ శక్తి అడ్డుకోలేదు :ప్రవీణ్ కుమార్
-హుజురాబాద్ లో మాత్రమే దళిత బందు తెరపైకి వచ్చింది
-హుజురాబాద్ లో 1000 కోట్లు ఎవరి ప్రయోజనాల కోసం
-దళిత విద్యార్థులకు సెల్ ఫోన్లు ఇవ్వడి, లాప్ టాప్ లు ఇవ్వండి
-మరిన్ని హాస్టల్స్ నిర్మించండి … విద్యకోసం ఖర్చు చేయండి
-తనను కలిసిన బహుజన ఉద్యోగులను సస్పెండ్ చేశారు

కేసీఆర్ సర్కారుపై విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరోక్ష విమర్శలు చేశారు. హుజూరాబాద్‌లో మాత్రమే దళిత బంధు ఎందుకు తెరపైకి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి పరిశోధన చేయకుండానే.. ఎవరికో గుణపాఠం చెప్పేందుకు రూ. 1000 కోట్లు పెడుతున్నారని విమర్శించారు.

రూ. వెయ్యి కోట్లతో పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు కొనిపెట్టడమే కాకుండా అద్భుతమైన హాస్టళ్లను నిర్మించవచ్చునని ప్రవీణ్ కుమార్ అన్నారు. రూ. 20 వేల డిజిటల్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. తనను కలిసిన బహుజన ఉద్యోగులను సస్పెండ్ చేశారని, మరి గుండెల్లో పెట్టుకున్న లక్షల మందిని ఏం చేస్తారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

తెలంగాణలో బహుజన స్థాపనను ఎవరూ ఆపలేరని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. బహుజనులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలనేది పాలకుల ఆలోచన అని అన్నారు. ఒక ఆలోచనకు సన్నద్దమైతే ప్రపంచంలో ఏ శక్తీ ఎవరినీ ఆపలేదన్నారు.
నేటి తరాన్ని అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా అన్యాయాన్ని నిలదీయాలని ప్రవీణ్ కుమార్ చెప్పారు. నేటి తరమే రాబోయే రాజ్యానికి వారసులు, చుక్కాని, ఇంధనం లాంటి వారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఆరేళ్ల పదవీ కాలం ఉండగానే.. తెలంగాణ గురుకులాలసెక్రటరీ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, రాజీనామా చేసిన తర్వాత ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరతారని, హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అదంతా ఊహాగానాలేనని తర్వాత తేలిపోయింది. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీలో చేరతారని సమాచారం. బీఎస్పీ పార్టీలో చేరి తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేస్తుండటంతో ఆయన ఆ పార్టీలో చేరే అవకాశాలు లేనట్లేనని స్పష్టమవుతోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రంపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

Leave a Reply

%d bloggers like this: