చరిత్ర సృష్టించిన సింధు… శుభాభినందనల వెల్లువ…

చరిత్ర సృష్టించిన సింధు… శుభాభినందనల వెల్లువ…
రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన తొలి భారత క్రీడాకారిణి
2016 రియో ఒలింపిక్స్ లో రజతం
ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం
గర్వపడుతున్నామన్న ఉపరాష్ట్రపతి
తిరుగులేని ప్రదర్శన అంటూ మోదీ కితాబు

చైనా షట్లర్ పై నెగ్గిన సింధు
21-13, 21-16తో సింధు జయభేరి
నిన్న సెమీఫైనల్లో ఓడిన సింధు

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ రెండో పతకం సాధించింది. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించగా, తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కాంస్యం నెగ్గింది. అంతేకాదు, ఈ పతకం ద్వారా సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు పుటల్లోకెక్కింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన సింధు, ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది.

నిన్న సింధు సెమీస్ లో ఓడిపోయిన తర్వాత తీవ్ర నిరాశలో కూరుకుపోయిన యావత్ భారతావని, తాజా విజయంతో ఉప్పొంగిపోతోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తదితరులు సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన పోరాటంతో టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధును మనస్ఫూర్తిగా అభినందించారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోషల్ మీడియాలో తన స్పందన తెలియజేశారు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన సింధుకు శుభాభినందనలు అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్ చరిత్రలో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణి సింధు చరిత్ర సృష్టించిందని కొనియాడారు. తన నిలకడ, అంకితభావం, నైపుణ్యంతో సరికొత్త ప్రమాణాలను నమోదు చేసిందని తెలిపారు.

సింధు చరిత్ర సృష్టించిందని, ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ సింధు మాత్రమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆమె అమోఘమైన ప్రదర్శన ప్రతి భారతీయుడ్ని గర్వించేలా చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ సింధు మరిన్ని ఘనవిజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ… సింధు తిరుగులేని ప్రదర్శనతో అందరం సంతోషిస్తున్నామని తెలిపారు. సింధు భారత్ కు గర్వకారణమని, దేశం నుంచి ఉద్భవించిన అతికొద్దిమంది అద్భుతమైన ఒలింపియన్లలో సింధు కూడా ఒకరని మోదీ కొనియాడారు.

కాంస్యం కోసం పోరులో సింధు విజయం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. మన ఏస్ షట్లర్ మరోసారి గర్వపడేలా చేసిందని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించినందుకు శుభాభినందనలు అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్యం చేజిక్కించుకుంది. ఇవాళ చైనా తార హి బింగ్జియావోతో జరిగిన పోరులో సింధు స్థాయికి తగిన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. పతకం అంచనాల ఒత్తిడి మధ్య బరిలో దిగిన సింధు… ఎక్కడా తడబాటు లేకుండా బింగ్జియావోను వరుస గేముల్లో మట్టికరిపించింది. తొలి గేమును 21-13తో సొంతం చేసుకున్న తెలుగుతేజం, ఆపై రెండో గేమును 21-15తో సాధించింది. తద్వారా భారత త్రివర్ణ పతాకాన్ని టోక్యో ఒలింపిక్స్ లో రెపరెపలాడించింది. ఒలింపిక్ క్రీడల్లో సింధుకు ఇది రెండో పతకం. 2016 రియో ఒలింపిక్స్ లో సింధు రజతం నెగ్గింది.

నిన్న జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు… చైనీస్ తైపేకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓటమిపాలవడం తెలిసిందే. అయితే, కాంస్యం కోసం పోరులో నెగ్గి కోట్లాది భారతీయుల ముఖాల్లో సింధు ఆనందం నింపింది. కాగా, వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం నెగ్గిన తర్వాత భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో ఇది రెండో పతకం.

Leave a Reply

%d bloggers like this: