Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పోడుభూముల సమస్యపై ఎర్ర జెండాల పోరుబాట …

పోడుభూముల సమస్యపై పోరుకు సై అంటున్న ఎర్రజెండాలు!
-రాష్ట్రంలో 2 కోట్ల 76 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డు లు
-కానీ కమిటీ పరిశీలనలో తేలింది 2 కోట్ల 55 లక్షల ఎకరాలు మాత్రమే
-మరో 21 లక్షల 80 ఎకరాలకు లెక్కలు తేలాలి
-అది ఎక్కడ ఉందో బయట పెట్టాలి
-పోడుభూములకు హక్కు పాత్రలకై ఉద్యమానికి సిద్ధపడుతున్న వైనం
-గిరిజన ప్రాంతాలలో జీపు జాతకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ సన్నద్ధం
– ఆందోళనకు సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ కార్యాచరణ

పోడు భూముల సమస్యపై పోరుకు ఎర్రజెండా పార్టీలు సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ప్రతిఘటన ఎదురౌతుంది. ఎకరం అరెకరం ఉన్న పేదల దగ్గర భూములకు పట్టాలు ఇవ్వాల్సిన పాలకులు వారిదగ్గర బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. సిపిఐ ,సిపిఎం , సిపిఐ (ఎం .ఎల్ ) న్యూ డెమోక్రసీ పార్టీలు ఇప్పటికే పొదుభులు పేదలకు దక్కాలని అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారికీ పోడు వ్యవసాయం చేసే హక్కును హరిస్తే ఎందాకైనా పోరాడేందుకు సిద్ధమని హెచ్చరిస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పోడుభూముల సమస్యపై జీపు జాతా ఈ నెల 6 నుంచి నిర్వహించ బోతున్నారు. ఎం ఎల్ న్యూ డెమోక్రసీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కు సిద్ధపడుతుంది. సిపిఎం ఇప్పటికే అనేక చోట్ల ఉద్యమాలు చేపట్టింది. కేసీఆర్ పోడుభూములపై చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

పోడుభూముల సమస్యపై ప్రతిసారి ఎన్నికలకు ముందు రాజకీయపార్టీలు వాగ్దానాలు చేయడం ,ఎన్నికల అనంతరం వాటిని విస్మరించడం రివాజుగా మారింది.అంతకు ముందు ఎన్నో ఏళ్లుగా అడవినమ్ముకొని పోడువ్యవసాయం చేసుకున్నటున్న గిరిజనులు భయం గుప్పిట్లో బతుకులు వెల్లడిస్తున్నారు. ఒక పక్క అటవీశాఖ అధికారులు ,మరోపక్క రెవెన్యూ అధికారులు నిత్యం అడవిబిడ్డలపై జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. 21 లక్షల 80 వేల ఎకరాల భూములకు నేటికీ లెక్కలు లేకపోవడం గమనార్హం .

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత మననీళ్ళు ,మన కొలువులు, మన నిధులు, మన భూములు అన్న కేసీఆర్ వాటిని విస్మరించనారనే విమర్శలు మూటగట్టుకున్నారు. నిధులు లేవు ,నియామకాల సంగతి దేవుడెరుగు , నీళ్లపై యుద్ధాలే చేయాల్సిని పరిస్థితి . ఇక భూముల వ్యవహారం చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి లక్షలాది ఎకరాలు బినామీల చేతుల్లో ఉన్నాయి . ఎన్నికల్లో ఊరూరూ తిరిగిన కేసీఆర్ గిరిజన నియోజకవర్గాలలో పోడుభూముల సమస్యను తానే స్వయంగా వచ్చి కుర్చీవేసుకొని పరిష్కరిస్తానని అన్నారు. ఇది ఒకచోట ఆరుచోట కాదు చాల చోట్ల అన్నారు. ఎన్నికలు జరిగి రెండున్నర సంవత్సరాలు అయింది. కానీ సీఎం కేసీఆర్ రాలేదు కుర్చీవేసుకొని కూర్చోలేదు. పోడు భూముల సమస్య పరిస్కారం కాలేదు.

రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారమే 2 కోట్ల 76 లక్షల 80 వేల ఎకరాల భూమి ఉంది. భూముల లెక్కలు తేల్చేందుకు ఒక కమిటీ ఏర్పాటు అయింది. ఆ కమిటీ తేల్చిన లెక్కల ప్రకారం 2 కోట్ల 55 లక్షల ఎకరాలు గుర్తించినట్లు చెప్పారు. మిగతా 21 లక్షల 80 ఎకరాల భూమి ఏమైనట్లు అనేది తేలాలి .కానీ దాన్ని తేల్చరు. కారణం అది బినామీల చేతుల్లో ఉండటమే . ఉమ్మడి ఖమ్మం , వరంగల్ , ఆదిలాబాద్ ,కరీంనగర్ లాంటి జిల్లాలోనే సుమారు 15 లక్షల ఎకరాల భూమి ఉందని ఒక అంచనా . 2015 -16 లలో భూపాలపల్లి, వరంగల్ జిల్లాలలో భూముల లెక్కలు తేల్చేందుకు అధికార్లులు సన్నద్ధం అయితే వాటి జోలికి పోకండని అప్పటి స్పీకర్ మధుసూదన చారి అధికారాలను మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు ప్రచారం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల అటవీ భూములు ఉండగా అందులో 96 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా లక్ష 4 వేల ఎకరాల భూమికి లెక్క తేలాల్సివుంది.

తరతరాలుగా అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలు ఆ అడవిపై హక్కు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. సాంప్రదాయ బద్దంగా వస్తున్న పోడు వ్యవసాయాన్ని గుర్తించి ఆ భూములపై హక్కులు కల్పించాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. అంతలోనే పోడుభూములపై పాడు దందా మొదలైంది. మొన్న ఆదిలాబాద్, నిన్న ఖమ్మం… రేపు ఎక్కడ? అసలేంటి గొడవ. అసలు పోడు భూములు అంటే ఏంటి?

అటవీ, పోడు భూములపై హక్కుల కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాల తర్వాత 2006లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. అంతకు ముందు అటవీ భూములను సాగుచేసుకుంటున్న వారికి ఈ చట్టం ప్రకారం హక్కులు కల్పించాల్సి ఉండగా నాటి ఉమ్మడి ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి . అడవుల్లోనూ, కొండ వాలుల్లోనూ చిన్న చిన్న చెట్లను, పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయమని ఆదివాసీలు పిలుస్తారు. సాంప్రదాయ బద్దంగా చేసుకునే ఇటువంటి వ్యవసాయంపై తెలంగాణ రాష్ట్రంలో లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి . అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుదారులను గుర్తించి సబ్‌డివిజన్‌ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలకు పంపాల్సి ఉంది. ఈ కమిటీల్లో నిర్ణయించిన విధంగా పట్టాలు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కట్టబెట్టింది. అటవీ భూములపై ఆదివాసీలకు హక్కులు ఇచ్చే విషయంలో అటవీ శాఖ అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. ఫలితంగా ఘర్షణలు జరుగుతున్నాయి.

ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అటవీ హక్కుల కోసం దరఖాస్తులు పెద్ద సంఖ్యలో అందాయి .వచ్చిన దరఖాస్తుల ప్రకారం 19.66 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కులు కల్సించాల్సి ఉంది. అదెంత వరకు అమలైందో అధికారులకే తెలియాలి. సామూహిక హక్కులతో కేవలం ఫల సాయంలో కొంత అనుభవించే అధికారం ప్రజలకు ఉంటుందే తప్ప యాజమాన్య హక్కులు, అధికారాలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దీని వల్ల ఆదివాసీ కుటుంబాలకు ప్రయోజనం లేకుండా పోయింది.

ఇక అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములకు హక్కులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం అది చేయకపోగా హరితహారం పేరుతో భూములను స్వాధీనం చేసుకోవటంపై చర్చ జరుగుతోందిప్పుడు. ఈ పరిస్థితుల్లోనే కొందరు అటవీ పోలీస్‌ అధికారులు ఆదివాసీల పట్ల దురుసుగా ప్రవర్తించటం, అక్రమ కేసులు పెట్టడంతో గిరిజన ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి . పోడు భూముల విషయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికి ఇంకా అధికారిక ఉత్తర్వులు కానీ కొత్త మార్గదర్శకాలు కానీ విడుదల కాకపోవడంపై రిగిజనులు మండిపడుతున్నాయ్‌.

.. పోడు భూముల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. రాజకీయం జోక్యంతో సమస్యకు మరింత ఆజ్యం పోసినట్లవుతోంది. పోడు భూముల వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి. కాగజ్‌నగర్‌ ఘటన సమస్య తీవ్రతకు పరాకాష్టగా నిలుస్తుండగా ఖమ్మం జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది. అసలు కాగజ్‌నగర్‌లో ఏం జరిగింది? పోడుభూముల కోసం పోరాడుతున్న గిరిజనులు అసలు సూత్రదారులను పక్కన పెట్టి అటవీ అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దశాబ్దాల నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుంలందరికి ఆ భూములపై హక్కును కల్పిస్తే ఈ సమస్యకు అవకాశమే ఉండేది కాదు. ప్రభుత్వం ఈ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించకుండా తాత్సారం చేస్తుండడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ఓవైపు చెట్ల నరికివేతతో అడవులన్నీ మైదానాలుగా మారుతుండడం, ఆ మైదానాలు క్రమంగా పోడు సాగు భూములుగా మారుతున్నట్లు చెబుతున్నారు. కేవలం వర్షధారంపైనే ఆధారపడుతున్న ఈపోడు వ్యవసాయం గిరిజన కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోంది. అధికారుల వైఖరిని గిరిజనులు నిరసిస్తూ ఆందోళనలు, దాడులకు దిగడం ఘర్షణలకు తావిస్తోంది. అటు స్మగ్లర్ల దాడులు, ఇటు పోడు సాగుదారుల దాడులతో అటవీ శాఖ అధికారులు సైతం ఉక్కిరిబిక్కరి అవుతున్నారు . ఈ క్రమంలో కాగజ్‌నగర్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కృష్ణతో పాటు ఆయన అనుచరులు అటవీ అధికారులపై జరిపిన దాడుల వ్యవహారం మరోసారి అటవీశాఖ ఆస్థిత్వాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు వాదనలు తెరపైకి వస్తున్నాయి. పోడు భూముల వ్యవహారం అటు అటవీశాఖ అధికారుల మెడకు చుట్టుకుంటుండగా గిరిజనులకు ఓ సమస్యగా మారింది. దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలంటూ గిరిజనులు నినదిస్తున్నారు. ప్రభుత్వాలు వారి సమస్యను పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తూనే ఆ హామీని విస్మరిస్తుండడం రీవాజుగా మారింది. దీంతో అటవీ భూములు రక్షించాల్సిన ఆ శాఖ అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అడకత్తెరలో పోకలాగా అటవీ అధికారుల పరిస్థితి మారిపోయింది. అటవీ భూములను రక్షించేందుకు ఆశాఖ అధికారులు అవలంభిస్తున్న విధానాలు వివాదాస్పదమవుతున్నాయి.

Related posts

జాతీయరాజకీయాల్లోకి రావాలని పెరుగుతున్న వత్తిడి …కేసీఆర్

Drukpadam

తండ్రి క్యాబినెట్ లో మంత్రి కాబోతున్న ఉదయనిధి …?

Drukpadam

బెంగాల్ ఉపపోరులో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు …

Drukpadam

Leave a Comment