భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపకుండా వీడియో తీస్తావా?: సైనికుడిపై సీజేఐ రమణ ఆగ్రహం!

భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపకుండా వీడియో తీస్తావా?: సైనికుడిపై సీజేఐ రమణ ఆగ్రహం!
బెయిల్ తిరస్కరణ
కూతురు వాంగ్మూలమూ వ్యతిరేకమే
స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని సూచన

అతడో సైనికుడు. పేరు సాహాబుద్దీన్. రాజస్థాన్ లోని అల్వార్. భార్య ఆత్మహత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న అతడికి.. ఆ రాష్ట్ర హైకోర్టు బెయిల్ ను తిరస్కరించింది. దీంతో అతడు తనపై వేసిన చార్జిషీట్ లో సరైన సాక్ష్యాధారాలను పేర్కొనలేదని, కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు గడప తొక్కాడు. కానీ, అక్కడ అతగాడికి సుప్రీంకోర్టు నుంచి చీవాట్లు ఎదురయ్యాయి. విషయం స్వతంత్ర దర్యాప్తు వరకూ వెళ్లింది. సాహాబుద్దీన్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ల ధర్మాసనం విచారించింది.

పిటిషనర్ పై సీజేఐ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపకుండా వీడియో తీస్తావా? అంటూ మండిపడ్డారు. స్వయానా నిందితుడి కూతురు వాంగ్మూలమూ మహిళ ఆత్మహత్యకు అతడే కారణమని చెబుతోందని, కీలక సాక్షులు, నిందితుల వాంగ్మూలాలను సేకరించే వరకు బెయిల్ ను ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

ఇక, తన న్యాయవాద జీవితంలో ఇలాంటి చార్జిషీటును తానెన్నడూ చూడలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాల్సిందిగా రాజస్థాన్ ప్రభుత్వానికి సూచించారు. పిటిషన్ ను వెనక్కు తీసుకుంటామన్న పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.

Leave a Reply

%d bloggers like this: