మరో వివాదంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… తనను అవమానించారన్న మహిళా ఎంపీపీ…

కార్యక్రమానికి ఆహ్వానం పలికిన అధికారులే వేధిక నెక్కనివ్వలేదు

ఒక ఎంపిపిని బలవంతంగా బయటకు పంపారు

స్థానిక టీఆర్ యస్ కార్యకర్త వేధిస్తున్నారు

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపెడుతున్నారు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో మంత్రి తనను అవమానించారని స్థానిక ఎంపీపీ రాణి ఆరోపించారు. కార్యక్రమానికి ఆహ్వానం పలికిన అధికారులు… తనను స్టేజీ మీదకు రానివ్వలేదని అన్నారు. బలవంతంగా తనను కార్యక్రమం నుంచి బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కమలాపూర్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం(అగస్టు 8) స్వయం సహాయక సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాలు,బ్యాంకు లింకేజీ,స్త్రీ నిధి రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీపీ రాణి… స్థానిక టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు తనను వేధిస్తున్నారంటూ మంత్రితో చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి ఎర్రబెల్లి తనను స్టేజీ పైకి రానివ్వలేదని ఆరోపించారు.

‘కమలాపూర్ ఎంపీపీని అయిన నన్ను కార్యక్రమానికి ఆహ్వానించారు… నాకు అన్యాయం జరిగిందని చెబుతుంటే బయటకు నెట్టించారు… ఇదెంత వరకు న్యాయం.. శనిగరంలో వేణు అనే టీఆర్ఎస్ కార్యకర్త… రెండు,మూడు రోజులుగా సోషల్ మీడియాలో నాపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. ఆ బాధ చెప్పుకోవడానికి వెళ్తే నన్ను బయటకు వెళ్లగొట్టారు. చెప్పలేని పదాలతో అతను నాపై పోస్టులు పెడుతున్నాడు. ఆ ఆధారాలతో సహా ఇక్కడికి వచ్చాను.నా భర్తను చంపేస్తా అంటున్నాడు. నాకు,నా భర్తకు ప్రాణహాని ఉంది. నా ఇంటికి ముందుకు వచ్చి మరీ అతను ఈల వేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక ఎంపీపీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే… సామాన్యులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది. ఆడపిల్లల వైపు చూస్తే గుడ్లు పీకేస్తా అని కేసీఆర్ న్నారు. ఇప్పుడు బాధ చెప్పుకోవడానికి స్టేజీ మీదకు వెళ్తే నెట్టేశారు.’ అని ఎంపీపీ రాణి వాపోయారు.

గత నెలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ మహిళా అధికారిణి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇదే కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవోపై ఆయన నోరు పారేసుకున్నారు. ‘మేడమ్ నీవైతే బాగానే ఊపుతున్నావ్.. కానీ ఇక్కడ ఊపడం లేదు..’ అని కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలకు అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

వివాదంపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి… దురుద్దేశంతోనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎర్రబెల్లి అన్నారు. ఉద్యోగులు,అధికారులపై తనకు గౌరవం ఉందని తెలిపారు. ఆ మహిళా ఎంపీడీవోతో తనకు పరిచయం ఉందని… ఒక కూతురిలా ఆమెను పలకరిస్తానని చెప్పారు. శుక్రవారం(జులై 9) ఉప్పల్‌లో జరిగిన గ్రామ ప్రగతి సభకు హాజరైనప్పుడు కూడా ‘కూతురు… బాగున్నావా…’ అంటూ ఆమెను పలకరించానని చెప్పారు. అక్కడున్నవారు కూడా తన మాటలు విన్నారని తెలిపారు.

గతంలో ఆ అధికారిణి దుగ్గండి మండలంలో పనిచేశారని… అక్కడ పనిచేసినప్పుడు ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించి పనులు చేయించారని అన్నారు. అక్కడ బాగా పనిచేశావని… ఇక్కడెందుకు పనిచేయట్లేదని అడిగానన్నారు. కానీ ఆ వ్యాఖ్యలను కట్ చేసి మిగతా వ్యాఖ్యలను మాత్రమే వీడియోలో చూపిస్తున్నారని… వాటినే వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. తానంటే గిట్టనివాళ్లే తనపై బురదజల్లేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

%d bloggers like this: