అమరావతి ఉద్యమానికి 600 రోజులు…ఉద్యమకారుల ర్యాలీ నిరాకరించిన పోలీసులు!

అమరావతి ఉద్యమానికి 600 రోజులు…ఉద్యమకారుల ర్యాలీ నిరాకరించిన పోలీసులు!
-హైకోర్టు నుంచి మంగళగిరి ఆలయం వరకు అమరావతి జేఏసీ ర్యాలీ
-రాజధాని పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు
-విజయవాడ-అమరావతి మార్గంలోనూ ఆంక్షలు
-600 రోజులుగా సాగుతున్న రైతుల పోరాటం ఓ చరిత్ర అన్న చంద్రబాబు
-రైతులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కఠిన అంక్షలు అమలవుతున్నాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు బయటి వారిని లోనికి రాకుండా అడ్డుకుంటున్నారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించాలని రైతులు, మహిళలు నిర్ణయించారు. ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు అమరావతి, పరిసర గ్రామాల్లో పోలీసులను భారీగా మోహరించారు.

ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులను పరిశీలించి స్థానికులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. మీడియాకు కూడా అనుమతి నిరాకరించారు. అలాగే, విజయవాడ-అమరావతి మార్గంలోనూ ఆంక్షలు అమలవుతున్నాయి. వాహనాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే విడిచిపెడుతున్నారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు నిరసనలకు దిగిన టీడీపీ కార్యకర్తలను తాడేపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు.

చంద్రబాబు స్పందన …..

అమరావతి రైతులు సాగిస్తున్న పోరాటం నేటితో 600 రోజులకు చేరగా, జేఏసీ ర్యాలీకి పోలీసులు అడ్డుచెప్పారు. పలు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 600 రోజులుగా సాగుతున్న రైతుల పోరాటం ఓ చరిత్ర అని ఉద్ఘాటించారు. ప్రజా రాజధాని కోసం రైతులు 32,323 ఎకరాలు త్యాగం చేశారని వెల్లడించారు. అమరావతిలో రైతులు, రైతు కూలీలు సాగిస్తున్న న్యాయపోరాటానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

అమరావతి ఆంధ్రుల రాజధాని మాత్రమే కాదు, ఆంధ్రులకు రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టించే కేంద్రం అని పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్నది అమరావతిపై దాడి మాత్రమే కాదని, రాష్ట్ర సంపదపైనా దాడి చేస్తోందని ఆరోపించారు. ఎంతో విద్వేషంతో ప్రజా రాజధానిని జగన్ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. జగన్ వల్ల 139 సంస్థలు అమరావతి ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లాయని వెల్లడించారు. అమరావతి అంతానికి వైసీపీ ప్రభుత్వం చేయని కుట్రంటూ లేదని అన్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే, మరింత ఉద్ధృతమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Leave a Reply

%d bloggers like this: