అమరరాజా తరలింపు వార్తలపై స్పందించిన సీపీఐ నారాయణ పరిశ్రమను ప్రభుత్వమే వెళ్లగొడుతోంది!

అమరరాజా తరలింపు వార్తలపై స్పందించిన సీపీఐ నారాయణ
పరిశ్రమను ప్రభుత్వమే వెళ్లగొడుతోంది
-రాజధాని రైతులపై పోలీసుల దమనకాండ తగదు
-జగన్ కోర్టుకు భయపడతారు.. అందుకే ఉద్యమాన్ని -అడ్డుకుంటున్నారు: రామకృష్ణ

ఏపీ లోని అమర్ రాజా బ్యాటరీ తయారీ సంస్థ ఇక్కడ నుంచి తరలిపోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. తిరుపతిలోని కనకంబాడి వద్ద ఉన్న ఈ పరిశ్రమనుంచి కాలుష్యం వస్తుందని అందువల్ల దాని కాలుష్యం తగ్గించాలని కోర్టు సంబంధిత అధికారులు అనేక సార్లు చెప్పిన మార్పు లేని ఫలితంగా దానిపై ప్రభుత్వం నిబంధనలను కచ్చితంగా అమలు జరపాలని ఆదేశాలు జారీచేసింది. దీనిపై పరిశ్రమల యాజమాన్యం తమపై రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి తెస్తుందని అందువల్ల పరిశ్రమని ఇక్కడ నుంచి తమిళనాడు కు తరలిస్తున్నట్లు పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. ఇది రాష్ట్రంలో రాజకీయ దుమారంగా మారింది. దీనిపై సిపిఐ నారాయణ మాటల్లోనే ….

ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమరరాజా ఏపీ నుంచి తరలిపోతోందన్న వార్తలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన నారాయణ.. ప్రభుత్వ తీరు వల్లే సంస్థ తరలిపోతోందని అన్నారు. అయినా, తరలిపోవడానికి ఇదేమైనా సూటకేస్ పరిశ్రమా? అని అన్నారు.

ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, లక్షలాదిమంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. కాలుష్యానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని, అంతేకానీ పరిశ్రమను వెళ్లగొట్టడం తగదని హితవు పలికారు.

అమరావతి ఉద్యమంపై మాట్లాడుతూ.. 600 రోజులుగా శాంతియుతంగా ఉద్యమం జరుగుతోందని, ఉద్యమకారులపై పోలీసుల నిర్బంధకాండ తగదని, దీనిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని సమస్యపై ప్రధాని మోదీ స్పందించాలని నారాయణ డిమాండ్ చేశారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఎవరికీ భయపడరు కానీ, కోర్టులకు మాత్రం భయపడతారని, అందుకనే న్యాయస్థానాల ఎదుట రైతులు ఉద్యమిస్తుంటే పోలీసులను ప్రయోగించి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Leave a Reply

%d bloggers like this: