దళిత బంధు గొప్ప కార్యక్రమం… కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ!

దళిత బంధు గొప్ప కార్యక్రమం… కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ
-కేసీఆర్‌కు మద్దతు… తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని వెల్లడి

-తాను కాంగ్రెస్ వీడేది లేదని వివరణ
-చచ్చినా సోనియా కాళ్ళ దగ్గరే చేస్తానని అంటున్న సర్వే

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కొనియాడారు. దళిత బంధు పథకంతో దళితుల జీవితాలు బాగుపడుతాయని… ఇది గొప్ప కార్యక్రమమని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘ఎవరికీ రాని ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున ఇవ్వడం మంచి నిర్ణయం. తద్వారా వారికి ఉపాధి అవకాశం ఏర్పడుతుంది. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 లక్షల దళిత కుటుంబాలకు దీన్ని అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి. పథకం పారదర్శకంగా అమలయ్యేలా వ్యవహరించాలి. దళిత బంధు విషయంలో రాజకీయం తగదు.’ అని సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ.. ఆయన నియామకంతో పార్టీలో పునరుత్తేజం వచ్చిందన్నారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని… అదే పార్టీలో కొనసాగుతానని తెలిపారు. పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గతంలో సర్వే సత్యనారాయణ కేంద్రమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అప్పటి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియానే కారణమని తీవ్ర విమర్శలు చేశారు. ఆ మరుసటి ఏడాది మల్కాజ్‌గిరి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పలువురు నేతలతో సర్వే సత్యనారాయణ తీవ్ర వాగ్వాదానికి దిగారు. సమావేశంలో దాదాపు కాంగ్రెస్ నేతల మధ్య దాడి జరిగినంత పనైంది. సర్వే తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర నాయకత్వానికి తనను సస్పెండ్ చేసే అధికారం లేదని, అది కేవలం సోనియా, రాహుల్ గాంధీలకే ఉందని చెప్పారు. తాను జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, సోనియా గాంధీ కాళ్ల దగ్గరే చస్తానని ప్రకటించారు.ఏఐసీసీ సభ్యుడైన తాను కేంద్ర మంత్రిగా పనిచేశానని, సోనియాకు మాత్రమే తాను విధేయుడినని చెప్పారు. ఉత్తమ్, కుంతియాల వల్లే పార్టీ ఓడిపోయిందని, పార్టీ ఓటమిపై మళ్లీ వారే సమీక్ష చేయడాన్ని ప్రశ్నించానన్నారు. దీంతో వారే తనపై రౌడీ మూకలను ఎగదోశారని, వారికి గట్టిగానే సమాధానం చెప్పానన్నారు.ఉత్తమ్, కుంతియాలు టికెట్లు అమ్ముకున్నారని, టీఆర్‌ఎస్‌కు కోవర్టులుగా పనిచేశారని ఆరోపించారు.

గతేడాది జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సర్వే సత్యనారాయణను రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరినట్లు ప్రచారం జరిగింది. అయితే సర్వే మాత్రం అధికారికంగా ఎక్కడా బీజేపీలో చేరలేదు. నిజానికి బీజేపీ నుంచి ఆయన రాజ్యసభ సీటు ఆశించారని… కానీ అందుకు హామీ లభించకపోవడంతోనే ఆ పార్టీలో చేరలేదనే ప్రచారం ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో సర్వే సత్యనారాయణ తిరిగి యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే రేవంత్ ఆయన్ను కలవడం గానీ లేదా సర్వే రేవంత్‌ను కలవడం కానీ జరగలేదు.

అయితే అయిన దళిత బందు తెచ్చిన కేసీఆర్ ను పొగడం కాంగ్రెస్ వాదులకు రుచించదు. ఈయన కూడా టీఆర్ యస్ లో చేరతారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న ఆయన దాన్ని ఖండిస్తున్నారు. తాను కాంగ్రెస్ వీడేది లేదని చచ్చినా సోనియా కాళ్ళ దగ్గరే చేస్తానని ప్రకటించారు.

 

Leave a Reply

%d bloggers like this: