హిమాచల్​ ను వణికిస్తున్న కొండచరియలు.. నదీ ప్రవాహాన్నే అడ్డుకున్న వైనం..

హిమాచల్​ ను వణికిస్తున్న కొండచరియలు.. నదీ ప్రవాహాన్నే అడ్డుకున్న వైనం.. 
-చంద్రభాగ నదికి అడ్డంగా పడిన బండరాళ్లు, మట్టిపెళ్లలు
-సమీప గ్రామాల ప్రజలకు వరద ముప్పు
-పంట పొలాలు మునిగే ప్రమాదం
-పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు

హిమాచల్ ప్రదేశ్ ను కొండచరియలు వణికిస్తున్నాయి. నెల నుంచి తరచూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలో కిన్నౌర్ లో పర్యాటకుల వాహనాలపై కొండమీదున్న బండలు దొర్లి పడి 9 మంది చనిపోయారు.

చివరి వారంలో కొండ చరియలు విరిగిపడి 175 మంది లాహౌల్ స్పితిలో చిక్కుకుపోయారు. కొన్ని రోజుల కిందట ఓ పెద్ద కొండలోని పెద్ద భాగం ముక్కలై రోడ్డును నామరూపాల్లేకుండా చేసింది. రెండు రోజుల క్రితం కిన్నౌర్ లో విరిగిన కొండచరియలు 14 మందిని సమాధి చేశాయి.

తాజాగా లాహౌల్ స్పితిలో నదీ ప్రవాహాన్నే అడ్డుకుంది. నీళ్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. కొండ నుంచి విరిగిపడిన రాళ్లు, మట్టి పెళ్లలు చంద్రభాగ నదికి అడ్డంగా పడ్డాయి. దీంతో ఆ నదికి సమీప గ్రామాల్లోని 2 వేల మంది ప్రజలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు.

నిన్న ఉదయం 9.30 గంటలకు కొండలోని ఓ భాగం విరిగిపడిందని జిల్లా డిప్యూటీ కమిషనర్ నీరజ్ కుమార్ చెప్పారు. నదీ ప్రవాహాన్ని అడ్డుకుందన్నారు. అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు నిపుణుల బృందం వెళ్లిందని, వీలైనంత త్వరగా నదీ ప్రవాహానికి దారులను క్లియర్ చేస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: