Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం …తాలిబన్ల చేతుల్లోకిఆఫ్ఘనిస్థాన్!

ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం …తాలిబన్ల చేతుల్లోకిఆఫ్ఘనిస్థాన్ –ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమావేశం
-అష్రఫ్ ఘనీ దేశద్రోహి, శిక్షించండి… భారత్ లోని ఆఫ్ఘన్ ఎంబసీ నుంచి అనుచిత ట్వీట్!
-భారత్ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర భేటీ
-తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐరాస నిర్ణయం
-ఆఫ్ఘన్ ప్రజలలో ఆందోళన.. ఏటీఎంలు, బ్యాంకుల ముందు భారీగా క్యూలు క‌ట్టిన వైనం
-కాల్పులతో దద్దరిల్లుతున్న కాబూల్.. గగనతలం మూసివేత..
-విమానాలను రద్దు చేసిన భారత్…ఎయిర్ పోర్టులో భయానక పరిస్థితులు
-కాబూల్​ విమానాశ్రయం రన్​ వేపైకి చొచ్చుకొచ్చిన జనం..
-అమెరికా సైన్యం కాల్పులు.. ఐదుగురి మృతి..
-తాలిబన్లు సౌండ్ పార్టీనే.. కళ్లు చెదిరే వారి ఆదాయ మార్గాలు ఇవే!
-గత వార్షిక బడ్జెట్ రూ. 11,829 కోట్లు

ఆఫ్ఘనిస్తాన్ రాజకీయప్రతిష్ఠిలో పూర్తిగా మారిపోయాయి.ఇప్పటివరకు అధికారంలో ఉన్న అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం గద్దెదిగక తప్పలేదు. అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదులుగా భావిస్తున్న తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్ఘన్ ప్రభుత్వం పోయింది. ప్రజల మద్దతు కూడా వారికే ఉండటంతో రాజధాని కాబుల్ సహా దేశంలోని అనేక పట్టణాలు రాష్ట్రాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఉన్న అధ్యక్షుడు ఘనీ దేశం విడిచి పారిపోయాడు. దీంతో ఐక్యరాజసమితి అత్యవసర సమావేశం వేర్పాటు చేసింది. ఆఫ్ఘన్ లో మాత్రం తదుపరి అధ్యక్షుడి కోసం మంతనాలు సాగుతున్నాయి. తాలిబన్ అధినేత ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ఎన్నికైయ్యే అవకాశం ఉంది.

ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తరుణంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఈరోజు అత్యవసరంగా భేటీ అవుతోంది. నేటి రాత్రి 7.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి భారత్ అధ్యక్షత వహించనుంది. ఆఫ్ఘనిస్థాన్ లో తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. ఆప్ఘన్ ప్రజలకు హాని తలపెట్టకుండా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా వ్యవహరించేలా తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.

యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కు ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1వ తేదీన ఈ బాధ్యతలను చేపట్టిన భారత్… నెల రోజుల పాటు ఈ బాధ్యతను నిర్వహించనుంది. అయితే, భారత్ బాధ్యతలను చేపట్టిన వెంటనే ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆగస్ట్ 6 నుంచి తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించారు.

కాల్పులతో దద్దరిల్లుతున్న కాబూల్.. గగనతలం మూసివేత..
విమానాలను రద్దు చేసిన భారత్…ఎయిర్ పోర్టులో భయానక పరిస్థితులు

కాబూల్ నగరం కాల్పులతో మోగిపోతోంది. దీంతో మామూలు వాణిజ్య విమానాల ప్రయాణానికి అక్కడి గగనతలాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కేవలం సైనిక అవసరాల కోసమే ఎయిర్ స్పేస్ ను వినియోగించుకోనున్నారు. దీంతో వివిధ దేశాల పౌరుల తరలింపునకు ఆటంకం ఏర్పడింది.

అక్కడి భారత పౌరులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు విమానాలను కాబూల్ కు పంపాలని అంతకుముందు నిర్ణయించింది. ఇవాళ రాత్రి 8.30 గంటలకు పంపాలని ముందుగా అనుకున్నా.. ఆ తర్వాత పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించి మధ్యాహ్నం 12.30 గంటల కల్లా కాబూల్ కు పంపించాలని నిర్ణయించింది. కానీ, ఇప్పుడు ఆ గగనతలాన్ని మూసివేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాబూల్ కు పంపించాలనుకున్న రెండు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.

కాగా, అమెరికా వెళ్లాల్సిన లేదా అక్కడి నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాలన్నింటినీ ఆఫ్ఘన్ గగనతలం మీది నుంచి కాకుండా దోహా మీదుగా మళ్లిస్తున్నట్టు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. దోహా హాల్టింగ్ లో ఇంధనం నింపుకుని ప్రయాణాన్ని మొదలుపెడతాయని చెప్పాయి. ఇప్పటికే షికాగో నుంచి వస్తున్న విమానాన్ని దారి మళ్లించారు.

ఇటు అమెరికాతో పాటు వివిధ దేశాలు తమ పౌరులను తీసుకెళ్లేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నా ఇప్పుడు గగనతలాన్ని మూసివేయడంతో అక్కడే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాబూల్​ విమానాశ్రయం రన్​ వేపైకి చొచ్చుకొచ్చిన జనం..
-అమెరికా సైన్యం కాల్పులు.. ఐదుగురి మృతి..

ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించేసుకోవడంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఏ విమానం దొరికితే ఆ విమానం ఎక్కేస్తున్నారు. దీంతో కాబూల్ విమానాశ్రయం మొత్తం గుంపులుగా వస్తున్న జనాలతో నిండిపోయింది. ఏ రన్ వే చూసినా ప్రజల హడావుడే కనిపిస్తోంది.

ఇవాళ ఉదయం ప్రజలు కాబూల్ ఎయిర్ పోర్ట్ లోని టార్మాక్ వద్దకు చొచ్చుకొస్తుండడంతో.. ఆ విమానాశ్రయాన్ని తమ అధీనంలో ఉంచుకున్న అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. ప్రజలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్చింది. కొందరు విమానం ఎక్కేందుకు పోటీపడి తోసుకుంటున్నారు. మెట్ల దారిలోని కాకుండా పక్క నుంచి కూడా ఎక్కే ప్రయత్నం చేశారు. ఘటనలో ఐదుగురు చనిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే కాల్పుల్లో చనిపోయారా? లేదా తొక్కిసలాటలో చనిపోయారా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. అధికారులు కూడా దీనిపై ఇంతవరకూ స్పందించలేదు.

ఘటనలకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇప్పటికే చాలా మంది ప్రజలను ఆ ప్రదేశం నుంచి అమెరికా సైన్యం తరలించింది. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన అనుచరులు తజికిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశం విడిచి వెళ్తున్న ఆఫ్ఘన్ ప్రజల కోసం పలు దేశాలు ఆపన్న హస్తాన్ని అందజేస్తున్నాయి. అందులో భారత్ మొదటి వరుసలో ఉంది. చాలా మంది ఆఫ్ఘనీలు భారత్ వైపే చూస్తున్నారు. విద్య, వైద్యం, ఇతర అన్ని విషయాల్లో మన దేశం మంచిదని వారు భావిస్తున్నారు.

తాలిబన్లు సౌండ్ పార్టీనే.. కళ్లు చెదిరే వారి ఆదాయ మార్గాలు ఇవే!
గత వార్షిక బడ్జెట్ రూ. 11,829 కోట్లు

ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల వశమైంది. అమెరికా బలగాలు ఆఫ్ఘన్ ను వదిలి వెళ్లిన రోజుల వ్యవధిలోనే యావత్ దేశాన్ని తాలిబన్ ముష్కరులు కైవసం చేసుకున్నారు. రాజీనామా చేసిన ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ… ఆయన భార్య, ఆర్మీ చీఫ్, దేశ భద్రతా సలహాదారులతో కలిసి దేశాన్ని వదిలి వెళ్లిపోయారు.

అయితే, ఆయన ఎక్కడకు వెళ్లారనే విషయంలో మాత్రం పూర్తి స్పష్టత లేదు. ఆయన తజకిస్థాన్ కు వెళ్లినట్టు తొలుత వార్తలు వచ్చాయి. మరోవైపు ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ కు పారిపోయారని ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరా తెలిపింది. దేశంలో రక్తపాతాన్ని నివారించేందుకే తాను కాబూల్ ను వీడుతున్నానని ఫేస్ బుక్ లో ఆఫ్ఘన్ పౌరులను ఉద్దేశించి ఘనీ ఓ పోస్ట్ చేశారు.

ఇంకోవైపు ఆఫ్ఘన్ ను మళ్లీ చేజిక్కించుకోవడానికి తాలిబన్లకు రెండు దశాబ్దాల కాలం పట్టింది. అగ్రరాజ్యం అమెరికా శిక్షణలో ఆరితేరిన ఆఫ్ఘన్ సేనలను ఓడించేందుకు తాలిబన్లు రెండు దశాబ్దాల పాటు పోరాడుతూనే ఉన్నారు. దేశంలో అధికారంలో లేకపోయినా రెండు దశాబ్దాల పాటు పోరాడే శక్తి, ఆర్థిక బలం వారికి ఎలా వచ్చాయనే అనుమానం ప్రతి ఒక్కరికీ వచ్చే ఉంటుంది.

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ సంస్థ ప్రపంచంలోని టాప్-10 ఉగ్రవాద సంస్థల్లో ఒకటి. అత్యంత సంపన్నమైన ఉగ్రసంస్థల్లో ఐదో స్థానంలో ఉంది. 2016లో ఫోర్బ్స్ మేగజీన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అప్పట్లో రూ. 14,800 కోట్ల వార్షిక టర్నోవర్ తో ఐసిస్ మొదటి స్థానంలో నిలిచింది. రూ. 2,900 కోట్ల టర్నోవర్ తో తాలిబన్ సంస్థ ఐదో స్థానంలో ఉంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, మైనింగ్ వ్యాపారాల ద్వారానే వీరికి అధిక ఆదాయం సమకూరుతోంది.

మరోవైపు గత ఏడాది నాటో విడుదల చేసిన వివరాల ప్రకారం తాలిబన్ల వార్షిక బడ్జెట్ రూ. 11,829 కోట్లు. అంటే 2016 నాటి ఫోర్బ్స్ జాబితా కంటే తాలిబన్ల టర్నోవర్ దాదాపు 400 శాతం పెరిగింది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ వార్షిక బడ్జెట్ రూ. 40 వేల కోట్లు కాగా… సైన్యానికి చేసిన కేటాయింపులు రూ. 800 కోట్లు మాత్రమే.

2019-20లో తాలిబన్ల ఆదాయం, ఆదాయ వనరుల వివరాలు:

మొత్తం ఆదాయం – రూ. 11,829 కోట్లు
మైనింగ్ ద్వారా – 3,400 కోట్లు
మాదకద్రవ్యాలు – రూ. 3,087 కోట్లు
విదేశీ విరాళాలు – 1,781 కోట్లు
విదేశీ ఎగుమతులు – రూ. 1,781 కోట్లు
పన్నులు – రూ. 1,187 కోట్లు
రియలెస్టేట్ ద్వారా – రూ. 593 కోట్లు.

అష్రఫ్ ఘనీ దేశద్రోహి, శిక్షించండి… భారత్ లోని ఆఫ్ఘన్ ఎంబసీ నుంచి అనుచిత ట్వీట్!

రెండు దశాబ్దాలుగా అమెరిగా బలగాల అండతో ఆఫ్ఘనిస్థాన్ లో కొనసాగిన ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన ఎట్టకేలకు ముగిసింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ ని కూడా తాలిబన్లు ఆక్రమించుకోవడంతో యావత్ దేశం ముష్కరుల గుప్పిట్లోకి వచ్చింది. ఇదే సమయంలో దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో తమ సొంత ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు తాలిబన్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరోవైపు ఆఫ్ఘన్ లో ఈ పరిణామాలన్నీ జరుగుతున్న సమయంలోనే ఇండియాలోని ఆఫ్ఘన్ ఎంబసీ అధికార ట్విట్టర్ ఖాతా నుంచి ఓ అనుచిత ట్వీట్ వచ్చింది. ట్వీట్ లో అష్రఫ్ ఘనీని ఉద్దేశించి దుండగులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అష్రఫ్ ఘనీ దేశద్రోహి అని… ఆయనను చూసి తాము సిగ్గుతో తలదించుకుంటున్నామని ట్వీట్ లో పేర్కొన్నారు.

ఘనీ బాబా (అష్రఫ్) తన అనుచరులతో కలసి దేశాన్ని విడిచి పారిపోయారని… అలాంటి వ్యక్తికి ఇన్నాళ్లు సేవ చేసినందుకు తమను క్షమించాలని ట్వీట్ చేశారు. ఆ దేశద్రోహిని దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడని అన్నారు. ఘనీ పాలన ఆఫ్ఘన్ పాలనలో ఒక మరక అని కామెంట్ చేశారు.

అయితే, ఈ ట్వీట్ కొద్దిసేపటికే డిలీట్ అయింది. అనంతరం ఆఫ్ఘన్ ఎంబసీ మీడియా కార్యదర్శి అబ్దుల్ అజాద్ మాట్లాడుతూ, తమ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని చెప్పారు. ఎంబసీ ట్విట్టర్ ఖాతాకు తాను యాక్సెస్ కోల్పోయానని… అయితే ఒక స్నేహితుడు ఈ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తనకు పంపించారని… తాను లాగిన్ కావడానికి ప్రయత్నించినా కుదరలేదని తెలిపారు.

అధ్యక్ష భవనంలో తాలిబన్ల రాజభోగాలు..

 

ఆఫ్ఘనిస్థాన్ లో అధికారం హస్తగతం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు దర్జా అనుభవిస్తున్నారు. ఆ దేశాధ్యక్ష అధికారిక భవనంలో రాజభోగాలను చవిచూస్తున్నారు. పంచభక్ష్యాలతో విందులు చేసుకుంటున్నారు. వాళ్లు భోగాలను అనుభవిస్తూనే.. ప్రపంచానికి పెనుముప్పులా పరిణమించిన ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు.

అమెరికాకు ఆఫ్ఘనిస్థాన్ లో అతిపెద్ద ఎయిర్ బేస్ (వైమానిక స్థావరం) అయిన బగ్రాం ఎయిర్ బేస్ నుంచి వేలాది మంది ప్రమాదకర ఉగ్రవాదులను విడుదల చేశారు. అక్కడ అమెరికా, ఆఫ్ఘన్ సైన్యం బంధించిన అతి భయంకరమైన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), అల్ ఖాయిదా, తాలిబన్, ఇతర ముఠాలకు చెందిన 5 వేల మంది ఉగ్రవాదులను తాలిబన్లు విడిచిపెట్టారు. బగ్రాం జిల్లా చీఫ్ దర్వాయిస్ రౌఫీ ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత మాజీ సైనికాధికారి, బీజేపీ నేత మేజర్ సురేంద్ర పూనియా వాటికి సంబంధించిన రెండు వీడియోలను పోస్ట్ చేశారు. అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన ఉగ్రవాదులను కాబూల్ జైళ్ల నుంచి తాలిబన్లు విడిచిపెట్టారంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ఇక నుంచి ప్రపంచానికి ‘ఉగ్ర సంగీతమే’నంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆఫ్ఘన్ ప్రజలలో ఆందోళన.. ఏటీఎంలు, బ్యాంకుల ముందు భారీగా క్యూలు క‌ట్టిన వైనం

 

ఆఫ్ఘ‌నిస్థాన్ లో తాలిబ‌న్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెల‌కొన్నాయి. ఉగ్ర‌వాదులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండ‌డంతో ఆ త‌ర్వాత త‌మ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మార‌నుంద‌ని భావిస్తున్నారు. పాస్‌పోర్టు ఉన్న‌వారు చాలా మంది దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న విష‌యం తెలిసిందే. ఉపాధి క‌ర‌వ‌వుతుంద‌ని, ఉద్యోగాలు కోల్పోతామ‌ని ఆఫ్ఘన్ ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

మరోపక్క బ్యాంకులు, ఏటీఎంల‌లో ఉన్న తమ డబ్బును డ్రా చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు పెద్ద ఎత్తున‌ బారులు తీరి క‌న‌పడుతున్నారు. ఇన్నాళ్లు క‌ష్ట‌ప‌డి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న డ‌బ్బుకు భ‌రోసా లేకుండా పోతుంద‌నే ఆందోళ‌న కూడా వారిలో నెల‌కొన్న‌ట్లు తెలుస్తోంది. వేలాది మంది ఇళ్ల‌ను వీడుతున్నారు. ఇళ్ల‌పై ఉగ్ర‌వాదులు దాడులు చేస్తార‌న్న భ‌యంతో బహిరంగ ప్రదేశాలకు చేరుతున్నారు. ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్లు ప్ర‌జ‌ల స్వేచ్ఛ‌ను హ‌రిస్తూ క‌ఠిన ఆంక్ష‌లు పెడ‌తార‌నే భ‌యం ఆ దేశ పౌరుల్లో నెల‌కొంది.

Related posts

రాజ్యసభ చైర్మన్ ప్యానల్ నుంచి విజయసాయి అవుట్ …

Drukpadam

తాజ్ మహల్ మాదిరి సచివాలయానికి మేం వెళ్లం: బండి సంజయ్

Drukpadam

ఖమ్మం లో రెండు గదుల ఇంటికి షాక్ తగిలేలా పన్ను 6 .50 లక్షలు…

Drukpadam

Leave a Comment