పాద యాత్రలో సాధారణ జీవితం: బండి సంజయ్

గుడారాల్లోనే నిద్ర….సాత్వికాహారమే భోజనం…
• జనంతో ఉంటూ వారి బాధలను పంచుకుంటూ భరోసా ఇవ్వడమే లక్ష్యం…
• ప్రజల ప్రధాన సమస్యల ఆధారంగానే ఉద్యమ కార్యాచరణ
• ‘పాదయాత్ర’లో సాధారణ జీవితం గడపాలని బండి సంజయ్ నిర్ణయం

ఈనెల 24 నుండి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడపేందుకు సిద్ధమయ్యారు.
నిద్ర, బోజనం, వసతి ఏర్పాట్లన్నీ అత్యంత సాదాసీదాగా ఉండేలా చూసుకుంటున్నారు. పాదయాత్ర కొనసాగినన్ని రోజులు గుడారాలు వేసుకుని అందులోనే నిద్రించాలని నిర్ణయించారు. తనతోపాటు పాదయాత్ర చేసే ముఖ్యులు సైతం గుడారాల్లోనే బస చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. గుడారాల్లో మంచం, ఫ్యాన్ చదవడానికి పత్రికలు మినహా పెద్దగా ఎలాంటి హంగు, అర్భాటాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని బండి సంజయ్ ఇప్పటికే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు తమ వసతి, భోజనం, నిద్ర వంటి విషయాల్లో హంగు అర్భాటాలకే ప్రాధానమిచ్చారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి మినహా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్ మోహన్ రెడ్డితోపాటు ఆయన సోదరి వైఎస్.షర్మిల వంటి వారంతా పాదయాత్ర సందర్భంగా రాత్రి విడిది కోసం అన్ని ఆధునిక, హుంగులతోపాటు ఏసీ సదుపాయాలున్న వాహనాలను వినియోగించారు. ఏరోజుకారోజు పాదయాత్ర ముగిసిన వెంటనే వీరంతా ఆయా వాహనాల్లోకి వెళ్లి స్నానపానాదులు ముగించుకుని, భోజనం చేసి అందులోనే నిద్రించేవారు.
కానీ బండి సంజయ్ మాత్రం హంగు, అర్భాటాలకు పూర్తిగా దూరంగా ఉంటూ అత్యంత నిరాడంబరంగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ‘‘నా పాదయాత్ర ముఖ్య ఉద్దేశం జనంలోనే ఉంటూ జనం బాధలు పంచుకోవడం. జనంతో కలిసిపోయి వారి కష్టనష్టాలు పంచుకోవాలంటే వారి సొంత మనిషిలా ఉండాలి. అందుకే సామాన్య జనం ఏ విధంగా గడుపుతారో…నేను కూడా పాదయాత్ర కొనసాగినన్ని రోజులు అట్లాగే ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయండి’’ అని వసతి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పాదయాత్ర కమిటీ సభ్యులకు సూచించారు.
ప్రతిరోజు వందలాది కార్యకర్తలు సంజయ్ తోపాటు పాదయాత్రలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు పాదయాత్రలో నడిచేందుకు సిద్ధంగా ఉన్న యువత, కార్యకర్తల, నాయకుల పేర్లను జిల్లాల నుండి తెప్పించుకునే పనిలో పాదయాత్ర కమిటీ నిమగ్నమైంది. వారందరికీ అవసరమైన గుడారాలు వేయడం, స్నానపానాదులకు ఏర్పాటు చేయడం కష్టమైనందున ప్రతి రోజు పాదయాత్ర ఎక్కడ ముగుస్తుందో…అక్కడికి సమీపంలోని ఫంక్షన్ హాల్ లేదా విద్యా సంస్థల్లో బస ఏర్పాటు చేస్తున్నారు.
బండి సంజయ్ మాత్రం పాదయాత్ర సాగినన్ని రోజులు బస, భోజనం విషయంలో ఎలాంటి హంగు అర్భాలు వద్దని పాదయాత్ర నిర్వాహకులకు స్పష్టం చేశారు. మాంసాహారం కూడా భుజించకూడదని నిర్ణయించారు. అదే సమయంలో తను భుజించే శాఖాహారంలోనూ గరం మసాలాలు లేకుండా చూసుకుంటున్నారు.
తొలిదశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 40 రోజులు సాగనుంది. కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి మలిదశ పాదయాత్ర చేపట్టాలని సంజయ్ భావిస్తున్నారు. ఏడాది పొడవునా పాదయాత్ర చేస్తూ జనం మధ్యలో ఉండేలా తన షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. ‘జనంతోనే ఉంటా. జనం బాధలు వింటా. జనానికి అండగా ఉంటా. జనం సమస్యలే ఎజెండాగా ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తా. అంతిమంగా తెలంగాణ భవిష్యత్తు మార్చేలా పాదయాత్రను కొనసాగిస్తా’ అని సంజయ్ చెబుతున్నారు.

Leave a Reply

%d bloggers like this: