Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సునంద పుష్క‌ర్ మృతి కేసులో శ‌శిథ‌రూర్‌ కు ఊర‌ట‌.. అభియోగాల కొట్టివేత‌!

సునంద పుష్క‌ర్ మృతి కేసులో శ‌శిథ‌రూర్‌ కు ఊర‌ట‌.. అభియోగాల కొట్టివేత‌
-2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్‌లో సునందా పుష్కర్ మృతి
-ఆత్మ‌హ‌త్య అని తేల్చిన పోలీసులు
-శశిథ‌రూర్ వ‌ల్లే బ‌ల‌వ‌న్మ‌ర‌ణ‌మ‌ని అభియోగాలు

సునంద పుష్క‌ర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌కు ఢిల్లీ సెష‌న్స్‌ కోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో శ‌శిథ‌రూర్‌పై ఉన్న అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేసింది. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్‌లో సునందా పుష్కర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

ఆమె ఆత్మహత్య చేసుకోవ‌డానికి ఓ ర‌కంగా శ‌శిథరూరే కార‌ణ‌మ‌య్యార‌ని 2018లో పోలీసులు చార్జ్‌షీట్ దాఖ‌లు చేశారు. ఆమె మృతి చెంద‌డానికి ముందు ఆమె చేసిన మెయిల్స్‌తో పాటు సామాజిక మాధ్య‌మాల్లో చేసిన పోస్టుల‌ను పోలీసులు అప్ప‌ట్లో ప‌రిశీలించారు. త‌న‌కు బ‌త‌కాల‌ని లేద‌ని, మృతి చెంద‌డానికి వారం రోజుల ముందు శ‌శిథ‌రూర్‌కి ఆమె ఓ మెయిల్ పంపార‌ని అప్ప‌ట్లో పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఆమె అప్ప‌ట్లో బ‌స చేసిన హోట‌ల్‌లో పోలీసుల‌కు 27 అల్‌ప్రాక్స్ మాత్ర‌లు కూడా ల‌భ్య‌మ‌య్యాయి. శ‌శిథ‌రూర్‌, సునంద పుష్క‌ర్‌కు 2010లో వివాహం జ‌రిగింది. గొడ‌వ‌ల కార‌ణంగా సునంద పుష్క‌ర్ యాంటీ-డిప్రెష‌న్ మాత్ర‌లు తీసుకునే వార‌ని అప్ప‌ట్లో పోలీసులు తెలిపారు. ఈ కార‌ణాల వ‌ల్ల శ‌శిథ‌రూర్‌పై అభియోగాలు న‌మోదు చేశారు. చివ‌ర‌కు ఆయ‌న‌కు సెష‌న్స్ కోర్టులో ఊర‌ట ల‌భించింది.

ఏడున్నరేళ్ల నరకానికి ముగింపు: శశిథరూర్​
సునంద ఆత్మహత్య కేసు తీర్పుపై కాంగ్రెస్ ఎంపీ స్పందన

ఏడున్నరేళ్లుగా తాను అనుభవిస్తున్న నరకానికి ఎట్టకేలకు ముగింపు దొరికిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. తన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య కేసులో థరూర్ పై ఉన్న అభియోగాలన్నింటినీ ఢిల్లీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. ఆ తీర్పుపై ఆయన స్పందించారు. జడ్జిలు గొప్ప తీర్పు ఇచ్చారని ఆయన కొనియాడారు. సునంద పుష్కర్ ఆత్మ ఇప్పుడే శాంతిస్తుందని అన్నారు.

‘‘నా భార్య సునంద మరణం తర్వాత ఎంతో కాలం నా చుట్టూ అలముకున్న కారు చీకట్లు ఈ తీర్పుతో తొలగిపోయాయి. ఆమె మరణంపై నా మీద ఎన్నెన్నో నిరాధారపూరితమైన ఆరోపణలను మోపారు. మీడియా ఎన్నో అభాండాలను వేసింది. అయితే, ఇప్పుడు వచ్చిన తీర్పు న్యాయవ్యవస్థపై నా నమ్మకాన్ని మరింత పెంచింది. తప్పు చేస్తే మన న్యాయవ్యవస్థ కచ్చితంగా శిక్షిస్తుంది. ఏదిఏమైనా న్యాయం జరిగింది’’ అని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.

Related posts

ట్విట్టర్ ,భారత్ ప్రభుత్వం మధ్య వార్ …….

Drukpadam

పిల్లలు 7 గంటలకే స్కూల్ కు వెళుతున్నప్పుడు…కోర్ట్ 9 గంటలకు ఎందుకు ప్రారంభం కాకూడదు!

Drukpadam

యాక్టింగ్ అంటేనే ఇష్టం అందులోనే ఎంజాయ్ చేస్తున్నా …రాజకీయ రంగ ప్రవేశంపై జూనియర్ ఎన్టీఆర్!

Drukpadam

Leave a Comment