వైసీపీ నేతలను మా మీదకు ఉసిగొల్పింది పోలీసులు కాదా?: ఆలపాటి రాజా!

వైసీపీ నేతలను మా మీదకు ఉసిగొల్పింది పోలీసులు కాదా?: ఆలపాటి రాజా
-రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన వారిపై కేసులు పెట్టారు
-ప్రభుత్వ మోచేతి నీళ్లు తాగి పోలీసులు పని చేస్తున్నారు
-పోలీసు అధికారుల తీరు చూసి సిగ్గుపడుతున్నా

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేశ్, ఇతర టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎలా తయారయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని అన్నారు.

ప్రభుత్వ మోచేతి నీళ్లు తాగి పోలీసులు పని చేస్తున్నారని ఆలపాటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రమ్య కుటుంబం వద్ద టీడీపీ నేతలు ఉన్న సమయంలోనే వైసీపీ నేతలను పోలీసులు ఎలా పంపుతారని ప్రశ్నించారు. తమ మీదకు వైసీపీ నేతలను ఉసిగొల్పింది పోలీసులు కాదా? అని ప్రశ్నించారు. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారారా? అనే అనుమానాలు తనకు కలుగుతున్నాయని అన్నారు. ఇలాంటి కిరాతక పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. పోలీసు అధికారుల తీరు చూసి తాను సిగ్గుపడుతున్నానని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: