Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీకి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి రాజీనామా? బుజ్జగింపులు రంగంలోకి దిగిన పెద్దలు !

టీడీపీకి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి రాజీనామా?

బుజ్జగింపులు రంగంలోకి దిగిన పెద్దలు !
టీడీపీ హైకమాండ్ పై గోరంట్ల తీవ్ర అసంతృప్తి
పార్టీలో తగిన గౌరవం ఇవ్వడం లేదనే ఆవేదన
రెండు, మూడు రోజుల్లో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా?
రాజీనామా అంటూ వస్తున్న వార్తలపై మాట్లాడేందుకు నిరాకరించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయడం లేదు: అచ్చెన్నాయుడు
బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్లిన చినరాజప్ప, జవహర్

ఏపీలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగలబోతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు వైసీపీ కండువాలను కప్పుకోనప్పటికీ… జగన్ సమక్షంలో వారి కుటుంబీకులను వైసీపీలో చేర్చి, ఆ పార్టీకి మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. ఈ షాకుల నుంచి టీడీపీ ఇంకా కోలుకోకమందే… ఆ పార్టీకి మరో పెద్ద షాక్ తగలబోతోందని తెలుస్తోంది.

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయారని విశ్వసనీయ సమాచారం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న గోరంట్ల మరో రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు పార్టీలో సరైన గౌరవం లేదని గోరంట్ల అసంతృప్తికి గురైనట్టు సమాచారం. తనలాంటి సీనియర్ ను కూడా హైకమాండ్ సరిగా పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఆయన రాజీనామా చేయబోతున్నారు.

పార్టీ శ్రేణులు బుజ్జగిస్తే ఆయన వెనక్కి తగ్గుతారా? అనే విషయంలో క్లారిటీ లేదు. మరోవైపు టీడీపీ నుంచి బయటకు వస్తే… బీజేపీలో చేరుతారా? లేక వైసీపీ గూటికి చేరుకుంటారా? అనే చర్చ కూడా జరుగుతోంది. గత మూడు, నాలుగు నెలల నుంచి వైసీపీపై కానీ, సీఎం జగన్ పైన కానీ ఆయన ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో, మీడియా కథనాలపై రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారం పట్ల ఇప్పుడేమీ వివరణ ఇవ్వనని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరినప్పటికీ, అంతకుమించి మాట్లాడేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.

కాగా, స్థానిక నాయకత్వం, అనుబంధ కమిటీల వ్యవహారంలో గోరంట్ల కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అటు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయబోతున్నారనే వార్త కలకలం రేపుతోంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు ఫోన్ చేశారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని సముదాయించారు. మరోవైపు బుచ్చయ్య చౌదరితో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, పార్టీకి బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయడం లేదని చెప్పారు. రాజమండ్రి డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు కూడా గోరంట్ల రాజీనామా చేయడం లేదని తెలిపారు.

బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్లిన చినరాజప్ప, జవహర్,నల్లమిల్లి

మరోవైపు గోరంట్ల రాజీనామా చేయబోతున్నారనే వార్త తెలియగానే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. టీడీపీలో ఊహించని సంక్షోభం నెలకొంది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ లో గోరంట్లతో మాట్లాడారు. తాజాగా పార్టీ నేతలు చినరాజప్ప, జవహర్ రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్లారు. ఆయనతో వారిరువురు చర్చలు జరిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన మనోభావాలను తెలుసుకున్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా గోరంట్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోరంట్లతో అన్ని విషయాలను మాట్లాడామని, ఆయన రాజీనామా చేయబోరని చెప్పారు. ఏ సమస్యలున్నా పార్టీలో అంతర్గతంగా పరిష్కరించుకుంటామని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు గోరంట్ల అని కొనియాడారు.

ఈ సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. గోరంట్ల ప్రస్తావించిన అంశాలను చంద్రబాబుకు నివేదిస్తామని తెలిపారు. రాజమండ్రి టీడీపీలో తనకు కొన్ని సమస్యలు ఉన్నట్టు గోరంట్ల చెప్పారని, తనను కొందరు గౌరవించడంలేదని చెప్పారని చినరాజప్ప వెల్లడించారు. రాజీనామా చేస్తానని గోరంట్ల ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా గోరంట్లకు పార్టీలో ఎప్పుడూ గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చంనాయుడు బుచ్చయ్య చౌదరి రాజీనామా వార్తలను కొట్టి పారేశారు.

Related posts

ప్రధాని అయ్యాక తొలిసారి స్పందించిన రిషి సునాక్!

Drukpadam

పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణంపై విచారణ కమిటీ వేసిన మమతా బెనర్జీ!

Drukpadam

మోదీ కాన్వాయ్‌ను అడ్డగించింది మేమే.. ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ !

Drukpadam

Leave a Comment