అమెరికా నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధాలు బంద్: బైడెన్ కీలక ఆదేశాలు!

అమెరికా నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధాలు బంద్: బైడెన్ కీలక ఆదేశాలు!
-ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలన రావడటంతో నిర్ణయం
-గతంలో ఆఫ్ఘన్ సైనికులకు ఆయుధాలిచ్చిన అమెరికా
-ఇప్పుడా ఆయుధాలు తాలిబన్ల పరం
-ఆయుధ సరఫరాపై సమీక్ష చేపట్టనున్న అమెరికా
-ఉగ్రమూకలకు తలవంచి చరిత్రలో నిలవద్దంటూ ప్రజలకు పిలుపు నిచ్చిన అమ్రుల్లా సాలేహ్
– తాలిబన్లకు తలవంచబోనని ప్రకటన…ప్రస్తుతం పాంజ్‌షిర్‌లో ఉన్న సాలేహ్

ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా సేనలు కొనసాగిన సమయంలో కుదిరిన ఒప్పందంపై పునఃసమీక్ష చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. ఆఫ్ఘన్ సేనలకు శిక్షణ ఇచ్చిన అమెరికా, అత్యాధునిక ఆయుధాలు కూడా అందించింది. అయితే ఇప్పుడు ఆ ఆయుధాలు తాలిబన్ల పరం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ కు పంపకుండా ఉన్న ఆయుధాలపై సమీక్ష చేయాలని రక్షణ రంగ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. అటు, ఆఫ్ఘనిస్థాన్ కు ఇవ్వాలని భావించిన 950 కోట్ల డాలర్ల ఆర్థికసాయాన్ని అమెరికా ఇప్పటికే నిలుపుదల చేసింది. తాలిబన్ల చేతికి ఆ నిధులు అందితే జరిగే పర్యవసానాల పట్ల అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు, తనను తాను దేశపు కేర్ టేకర్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న నేత అమ్రుల్లా సాలేహ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను నమ్మే లక్షల మందిని నిరుత్సాహపరచను. తాలిబన్లకు ఎప్పటికీ తల వంచను’’ అని అమ్రుల్లా ప్రకటించారు. ప్రజలెవరూ కూడా ఉగ్రమూకలకు తలవంచి చరిత్రలో నిలవద్దని పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే దేశాలు చట్టాలను గౌరవించాలని, హింసను కాదని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ చాలా పెద్దదని.. దాన్ని పాకిస్థాన్ ఆక్రమించడం లేదనీ, అలాగే తాలిబన్లు దేశాన్ని పాలించడం అసాధ్యమని ఆయన చెప్పారు. చరిత్రలో ఉగ్రవాదులకు తలవంచిన అవమానాన్ని లిఖించుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో ఇంకా తాలిబన్ల వశం కాని పాంజ్‌షిర్‌ లోయ ప్రాంతంలో ఆయన ప్రస్తుతం తలదాచుకున్నారు. ఆయన ఇక్కడే పుట్టి పెరిగి, శిక్షణ పొందారట. గతంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన అహ్మద్ షా మసూద్‌ కుమారుడితో కలిసి ఆయన మిలటరీ దళాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నుంచి తాలిబన్లకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించాలనే యోచనలో అమ్రుల్లా, మసూద్ కుమారుడు ఉన్నట్లు సమాచారం. తాలిబన్ సేనల నుంచి తప్పించుకున్న ఆఫ్ఘన్ మిలటరీ దళాలు ఇప్పుడు పాంజ్‌షిర్ చేరుతున్నట్లు తెలుస్తోంది.

 

Leave a Reply

%d bloggers like this: