పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో అల్పాహారం తీసుకున్న కిషన్ రెడ్డి!

పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో అల్పాహారం తీసుకున్న కిషన్ రెడ్డి!
-సూర్యాపేటలో మెరుగు మారతమ్మ ఇంట్లో అల్పాహారం తీసుకున్న కిషన్ రెడ్డి
-కల్నల్ సంతోశ్ బాబు విగ్రహానికి నివాళి
-చిన్న పిల్లలకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటన

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక చింతల చెరువులో ఉంటున్న జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలు అవార్డు పొదిన మెరుగు మారతమ్మ ఇంట్లో ఈ ఉదయం ఆయన అల్పాహారాన్ని స్వీకరించారు. ఆ తర్వాత మారతమ్మను సన్మానించారు. అనంతం కల్నల్ సంతోశ్ బాబు విగ్రహానికి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేబినెట్ మంత్రిగా ప్రధాని మోదీ తనకు పదోన్నతి కల్పించారని చెప్పారు. రైతులు, దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారి కుటుంబాలను కలవాలని సూచించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరించాలని చెప్పారని అన్నారు. కరోనా పరిస్థితుల్లో కూడా ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టకుండా పారిశుద్ధ్య కార్మికురాలు మారతమ్మ బాధ్యతలను నిర్వహించారని కితాబునిచ్చారు. అందరి సహకారంతోనే కరోనాను అరికట్టగలమని కిషన్ రెడ్డి అన్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని… చిన్న పిల్లల కోసం వ్యాక్సిన్ ను ప్రధాని త్వరలోనే ప్రారంభిస్తారని చెప్పారు. దీపావళి వరకు ఇవ్వాలనుకున్న ఉచిత బియ్యం పంపిణీని అవసరమైతే మరికొన్ని రోజులు కొనసాగిస్తామని తెలిపారు. కరోనా వల్ల చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తోందని చెప్పారు. కరోనా వారియర్స్ ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో గాంధీ ఆసుపత్రికి తాను తొమ్మిది సార్లు వెళ్లి, అక్కడి పరిస్థితులను పరిశీలించానన్నారు.

Leave a Reply

%d bloggers like this: