షర్మిల పార్టీకి ఇందిరా శోభన్ గుడ్ బై …ఇదే బాటలో మరికొందరు !

వైఎస్ షర్మిలకు షాక్.. పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా
-రాజీనామా లేఖను షర్మిలకు పంపిన ఇందిరా శోభన్
-తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన
-కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం

ఇంకా తెలంగాణాలో వైయస్ షర్మిల పార్టీ నిర్మాణం జరగలేదు …. పార్టీ దశ ,దిశా పై క్లారిటీ లేదు …. షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆమె పోరాటానికి ఒకరిద్దరు తోడైన వారు మెల్లగా జారుకుంటున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యనేత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఇందిరా శోభన్ వంతు అయింది. మరికొందరు కూడా ఇదే దారిలో ఉన్నట్లు సమాచారం . దీంతో ఈ పార్టీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి.

వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కీలక నేతగా ఉన్న ఇందిరా శోభన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను అధ్యక్షురాలు షర్మిలకు పంపించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఈ ఉదయం ఆమె ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె తెలిపారు. తనకు పార్టీలో పని చేసే అవకాశం కల్పించిన సోదరి షర్మిలకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, అమరవీరుల ఆశయాల సాధన కోసం, నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, మైనార్టీల బతుకు బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం తాను కొట్లాడుతూనే ఉంటానని ఇందిర తెలిపారు. అందుకే షర్మిలక్క పార్టీలో ఉండకూడదని… శ్రేయోభిలాషులు, అభిమానులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. జనం కోసం అడుగులు వేస్తానని తెలిపారు.

వైఎస్సార్టీపీకి ఇప్పటికే ఒకరిద్దరు నేతలు రాజీనామా చేశారు. ఇందిరా శోభన్ కూడా రాజీనామా చేస్తారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నప్పటికీ… ఆ వార్తలపై ఆమె స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీని వీడి ఆమె షర్మిల పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడంతో… ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు ఇంతకాలం వైఎస్సార్టీపీలో ఇందిర కీలకపాత్రను పోషిస్తూ వచ్చారు. పార్టీ సభలు, సమావేశాల్లో కీలకంగా వ్యహరించారు. డిబేట్స్ లో పార్టీ గొంతుకను బలంగా వినిపించే ప్రయత్నం చేశారు.

Leave a Reply

%d bloggers like this: