తెనాలి ఆటో డ్రైవర్ నిజాయతీకి పోలీసుల ఫిదా!

తెనాలి ఆటో డ్రైవర్ నిజాయతీకి పోలీసుల ఫిదా!
ప్రయాణికురాలి రూ. 21 లక్షల సొత్తు పోలీసులకు అప్పగింత
వివాహం కోసం హైదరాబాద్ నుంచి తెనాలి వచ్చిన మహిళ
బ్యాగులో డబ్బు, బంగారు నగలు
డ్రైవర్ రవిని సత్కరించిన పోలీసులు

గుంటూరు జిల్లా తెనాలి ఆటో డ్రైవర్ నిజాయతీకి పోలీసులు ఫిదా అయ్యారు. ఆటోలో ప్రయాణికురాలు మర్చిపోయిన సొత్తును పోలీసులకు అప్పగించి శభాష్ అనిపించుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ వివాహం కోసం నిన్న తెనాలి వచ్చి చినరావూరు వద్ద ఆటో ఎక్కింది.

అనంతరం గమ్యస్థానం వద్ద ఆటో దిగిన ఆమె తన బ్యాగును ఆటోలో మర్చిపోయింది. కాసేపటి తర్వాత బ్యాగు మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగులో రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 1.5 లక్షల నగదు ఉన్నట్టు పేర్కొంది.

మరోవైపు ఆటోలో బ్యాగ్ కనిపించడంతో తెరిచి చూసిన డ్రైవర్ రవి అందులోని బంగారం, డబ్బు చూసి షాకయ్యాడు. తన ఆటో ఎక్కిన మహిళే దానిని మర్చిపోయి ఉంటుందని భావించాడు. బ్యాగులో అంతమొత్తంలో బంగారం, డబ్బులు ఉన్నప్పటికీ పిచ్చి ఆలోచనలు చేయకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బ్యాగును పోలీసులకు అప్పగించాడు.

అప్పటికే స్టేషన్‌లో ఉన్న మహిళకు పోలీసులు ఆ బ్యాగును అప్పగించారు. అందులోని నగదు, ఆభరణాలు సరి చూసుకున్న ఆమె ఆటో డ్రైవర్ నిజాయతీని అభినందించారు. రవి నిజాయతీకి ఫిదా అయిన పోలీసులు అతడిని సత్కరించారు.

Leave a Reply

%d bloggers like this: