ఆఫ్ఘన్ లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అమెరికా!

ఆఫ్ఘన్ లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అమెరికా!
-ఆఫ్ఘ‌నిస్థాన్‌లో అమెరికా పౌరుల భద్రతే మా లక్ష్యం అంటున్న జో బైడెన్
-ఈ ప్రక్రియ చరిత్రలో నిలిచిపోనుంది: ఆఫ్ఘ‌న్ నుంచి పౌరుల త‌ర‌లింపుపై
-వారిని విమానాల్లో త‌ర‌లించ‌డం క్లిష్టమైన ప్రక్రియ
-కాబూల్ ఎయిర్ పోర్టులో అమెరికా బలగాలతో భ‌ద్ర‌త‌ కట్టుదిట్టం
-ఆఫ్ఘ‌న్‌లో ఆప‌రేష‌న్ నిర్వ‌హించి, తాలిబన్ల కళ్లుగప్పి ఓ కుటుంబాన్ని తీసుకెళ్లిన అమెరికా
-గ‌తంలో అమెరికాకు సాయం చేసిన ఖాలిద్
-ఆయ‌న కోసం తాలిబ‌న్ల గాలింపు
-‘ఆపరేషన్‌ ప్రామిస్‌ కెప్ట్‌’ పేరుతో ఖాలిద్‌ను కాపాడిన అమెరికా
-ఖాలిద్ కుటుంబాన్ని సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లింపు

ఆఫ్ఘన్ వ్యవహారంలో అమెరికా వ్యవహాత్మకంగా వ్యవహరిస్తోంది. అక్కడనుంచి అమెరికా పౌరులను తరలించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొంటుంది. అందులో భాగంగానే కబాలి విమాశ్రయాన్ని తమగుప్పిట్లో ఉంచుకుంది. అక్కడ నుంచి అమెరికా పౌరులతో పాటు తమకు సహకరించిన ఆఫ్ఘన్ పౌరులను సైతం రక్షించే పనిలో నిమగ్నమైంది. తాలిబన్ల కళ్ళు గప్పి అమెరికా తనకు సహకారం అందించిన ఒక ఆఫ్ఘన్ పౌరుణ్ణి చాకచక్యంగా తీసుకోని పోవడం వైరల్ అయింది.

ఆఫ్ఘ‌నిస్థాన్ ను తాలిబ‌న్లు ఆక్రమించి రెచ్చిపోతోన్న అంశంపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మ‌రోసారి స్పందించారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో అమెరికా పౌరుల భద్రతే తమ లక్ష్యమని తెలిపారు. ఆ దేశం నుంచి వారిని విమానాల్లో త‌ర‌లించ‌డం క్లిష్టమైన ప్రక్రియ అని, ఈ ప్రక్రియ చరిత్రలో నిలిచిపోనుందని చెప్పారు.

ఆ దేశంలో అమెరికా బలగాలు క‌ఠిన పరిస్థితుల మ‌ధ్య‌ పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్ప‌టికీ ఆఫ్ఘన్‌లోని కాబూల్ ఎయిర్ పోర్టులో అమెరికా బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఉందని, మొత్తం 4 వేల మంది భద్రతా సిబ్బంది ఉన్నారని చెప్పారు. ఆర్మీకి చెందిన‌ విమానాలు మాత్రమే కాకుండా ఛార్టర్ విమానాలు కూడా అక్క‌డ ఉన్నాయ‌ని తెలిపారు. ఆఫ్ఘ‌న్ నుంచి పౌరులను తరలించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. అమెరికా పౌరులంద‌రినీ అక్క‌డి నుంచి క్షేమంగా తీసుకొస్తామని తెలిపారు.

కాబుల్‌లో కనిపిస్తున్న దృశ్యాలు విచార‌క‌ర‌మ‌ని చెప్పారు. ఆ విమానాశ్రయం వ‌ద్ద‌ ఉన్న‌ వారంద‌రినీ ఎప్పటిలోగా విదేశాల‌కు త‌ర‌లిస్తామ‌న్న విష‌యాన్ని ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. కాగా, ఆఫ్ఘ‌న్‌లో అమెరికా బలగాలకు సహకరించిన వారంద‌రినీ తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అగ్ర‌రాజ్యం భావిస్తోంది.

ఆఫ్ఘ‌న్ నుంచి త‌మ‌ పౌరుల‌నే కాకుండా ఆ దేశంలో త‌మ‌కు స‌హ‌క‌రించిన వారిని కూడా అమెరికా విమానాల్లో త‌ర‌లిస్తోన్న విష‌యం తెలిసిందే. ఆఫ్ఘ‌న్‌లో త‌మ‌కు స‌హ‌క‌రించిన వారిని తాలిబ‌న్ల బారి నుంచి ర‌క్షించ‌డానికి అమెరికా సైన్యం అప‌రేష‌న్లు నిర్వ‌హిస్తోంది.

తాజాగా, ఆఫ్ఘ‌న్‌కు చెందిన ఓ పోలీస్‌ ఉన్నతాధికారిని తాలిబన్ల కళ్లుగప్పి అమెరికాకు తీసుకెళ్లింది. ‘ఆపరేషన్‌ ప్రామిస్‌ కెప్ట్‌’ పేరుతో తాజాగా చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా మహమ్మద్‌ ఖాలిద్‌ వర్దక్ అనే అధికారితో పాటు ఆయ‌న కుటుంబాన్ని ర‌క్షించాల‌ని సైన్యం ప్ర‌ణాళిక వేసుకుంది. చివ‌ర‌కు ఆయ‌న కుటుంబాన్ని ర‌క్షించింది.

ఆఫ్ఘ‌న్‌లో అమెరికా సైనికులతో కలిసి ఇన్నాళ్లు ప‌నిచేసిన ఆయ‌నపై గ‌తంలో ఉగ్ర‌వాదులు దాడి చేయ‌డంతో ఆయ‌న‌ కాలు దెబ్బతింది. అనంత‌రం అమెరికా సాయంతో ఆయ‌న‌ కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. అనంత‌రం మళ్లీ విధుల్లో చేరి అమెరికాకు స‌హ‌క‌రిస్తూ ఆఫ్ఘ‌న్‌ పోలీసు దళంలో ప‌నిచేశారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌ తాలిబన్ల వ‌శం కావ‌డంతో ఆయ‌న కోసం ఉగ్ర‌వాదులు ఇంటింటా గాలించారు. ఆయ‌న క‌న‌ప‌డితే కాల్చి వేసేందుకు ప్ర‌య‌త్నించారు.

త‌న‌ కుటుంబాన్ని రక్షించుకునేందుకు మహమ్మద్‌ ఖాలిద్‌ వర్దక్ పలుసార్లు త‌న‌ స్థావరం మార్చుకున్నారు. అమెరికా సైన్యంలోని కొంద‌రు ఆయ‌న‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చి, కుటుంబంతో పాటు తాము చెప్పిన ప్రదేశానికి వస్తే అమెరికాకు త‌ర‌లిస్తామ‌ని తెలిపారు. తాలిబన్ల కంట ప‌డ‌కుండా ఆయ‌న అనేక క‌ష్టాలు ఎదుర్కొని చివ‌ర‌కు అమెరికా సైన్యం వ‌ద్ద‌కు చేరారు. దీంతో అమెరికా సైన్యం ఆయనతో పాటు ఆయ‌న‌ భార్య, నలుగురు పిల్లలను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది.

Leave a Reply

%d bloggers like this: