ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు: సీఎం జగన్ ఆవేదన!

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు: సీఎం జగన్ ఆవేదన
-కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష
-ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనల ప్రస్తావన
-చేయగలిగినంత చేశామని వెల్లడి
-స్వార్థ రాజకీయ ప్రయోజనాలు అంటూ వ్యాఖ్యలు

సీఎం జగన్ ఇవాళ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనలను సీఎం జగన్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. కొన్నిరోజుల కిందట రాష్ట్రంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయని వెల్లడించారు. ఈ ఘటనలు జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు, చర్యలు తీసుకున్న వైనం అందరికీ తెలుసని స్పష్టం చేశారు. తనతో సహా కలెక్టర్లు, ఎస్పీలు చేయగలిగినంత చేస్తున్నామని, అయినప్పటికీ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లలు, వారి కుటుంబ గౌరవాలను బజారుకీడుస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఓ వర్గం మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తోందని, తాము దానితో కూడా పోరాడుతున్నామని వెల్లడించారు.

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న వైనంపై సీఎం జగన్ మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. . కొవిడ్ ముప్పు తొలగిపోలేదని, అప్రమత్తంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. కేసుల సంఖ్యతో సంబంధం లేకుండా అధికారులు నిత్యం పర్యవేక్షణ, సమీక్షలు జరుపుతుండాలని ఆదేశించారు. కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని పేర్కొన్నారు.

రోజువారీ కేసుల సగటు 1,300కి వచ్చినప్పటికీ, ఉదాసీనతకు చోటివ్వరాదని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ పై స్పష్టత లేదని, అధికారులు సర్వసన్నద్ధతతో ఉండాలని వివరించారు. పాజిటివిటీ రేటు, రికవరీ రేటు గణాంకాలు, అంకెలను అధికారులు పట్టించుకోవద్దని, కరోనా మార్గదర్శకాల అమలులో ఏమరుపాటుకు తావివ్వరాదని నిర్దేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాల్లో ఆదేశాలు జారీ చేశారు.

కరోనా సమయంలో మార్గదర్శకాలు

కరోనా మార్గదర్శకాలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలి.
వివాహాది శుభకార్యాల్లో 150 మందికి మించరాదు.
విద్యాసంస్థల్లో కరోనా నియమావళి తప్పకుండా పాటించాలి. విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే స్కూల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలి. సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలి.
104 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా సకల సేవలు అందించాలి. కరోనా తగ్గింది కదా అని అలసత్వంతో వ్యవహరించరాదు.
85 శాతం ప్రజలు వ్యాక్సిన్ రెండు డోసులు పొందేంత వరకు అన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
అత్యధికంగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి కేంద్రీకరించాలి.
వర్షాకాలం వస్తోంది. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఉండాలి.

Leave a Reply

%d bloggers like this: